MLC Kavitha: ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..

పలు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులపై ఎమ్మెల్సీ కవిత సమీక్షించారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ నివాసంలో మంగళవారం పలువురు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.

Update: 2023-07-25 15:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పలు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులపై ఎమ్మెల్సీ కవిత సమీక్షించారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ నివాసంలో మంగళవారం పలువురు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. నియోజకవర్గాల్లోని అభివృద్ధి పనులు, నిధుల మంజూరుతో పాటు పలు అంశాలపై చర్చించారు. రోడ్లు, తాగునీటి కాల్వల అభివృద్ధిపై ప్రభుత్వానికి అందించాల్సిన ప్రతిపాదనలపై మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. నియోజకవర్గాల్లోని మండలాల్లో జరిగిన అభివృద్ధి, పెండింగ్ అంశాలను క్షుణ్నంగా తెలియజేయాలన్నారు. బోధన్ నియోజకవర్గంలోని పెండింగ్ అంశాలపై ఎమ్మెల్యే షకీల్ నివేదించారు.

రోడ్లు, తాగునీటి కాల్వల అభివృద్ధిపై ప్రభుత్వానికి అందించాల్సిన ప్రతిపాదనలు తెలిపారు. అదే విధంగా ఎమ్మెల్సీ మధుసూదనచారి నేతృత్వంలో విశ్వ బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన పెద్దలతో భేటీ అయ్యారు. పలు అంశాలను చర్చించి, విశ్వబ్రాహ్మణులకు సహాయసహకారాలు అందజేస్తానని హామీ ఇచ్చారు. సింగరేణి ప్రాంత నియోజకవర్గాల స్థానిక ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. కార్మికుల, ప్రజాసమస్యలపై చర్చించారు. సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, డాక్టర్ సంజయ్ కుమార్ తదితరులున్నారు.

ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి

ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ప్రభుత్వం నుంచి సాయం కోరుతూ తెలంగాణ ఆటో డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ప్రతినిధులు మంగళవారం కలిసి వినతి పత్రం అందించారు. వినతుల పట్ల కవిత సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.

Tags:    

Similar News