సీబీఐ ముందుకు కేసీఆర్? BRS పార్టీలో టెన్షన్.. టెన్షన్!

'ఫామ్ హౌజ్' కేసులో సీఎం కేసీఆర్‌ను సీబీఐ విచారించే చాన్స్ ఉందనే టాక్ మొదలైంది. ఈ కేసు వీడియో టేపులను సీఎం ప్రెస్ మీట్‌లో బహిర్గతం చేశారు.

Update: 2022-12-29 03:01 GMT

దిశ,తెలంగాణ బ్యూరో: 'ఫామ్ హౌజ్' కేసులో సీఎం కేసీఆర్‌ను సీబీఐ విచారించే చాన్స్ ఉందనే టాక్ మొదలైంది. ఈ కేసు వీడియో టేపులను సీఎం ప్రెస్ మీట్‌లో బహిర్గతం చేశారు. కాగా.. కేసును విచారించే సంస్థల వద్ద ఉండాల్సిన ఆధారాలను ఎవరు ఇచ్చారు? అని సీఎంను దర్యాప్తు సంస్థ అడగవచ్చనే ప్రచారం న్యాయనిపుణుల్లో చర్చ నడుస్తున్నది. రెండు రోజుల కింద ఫామ్ హౌజ్ కేసుపై హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. సిట్ విచారణ సరిగా లేదని, పూర్తిగా ఎంక్వైరీ చేసేందుకు కేసును సీబీఐకి అప్పగిస్తూ తీర్పు చెప్పింది. దీనిపై ప్రభుత్వం అప్పీలుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నది. అయితే హైకోర్టు, సుప్రీం కోర్టులో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రాకపోతే సీబీఐ రాష్ట్రంలోకి ఎంటర్ అవొచ్చనే ప్రచారం జోరందుకుంది. కేసులోని నిందితులు, బాధితులు, పోలీసులను వరుసగా విచారణకు సీబీఐ పిలవనుంది.

ప్రెస్ మీట్‌నే ముంచిందా..?

నవంబర్ 3న ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించి ఫామ్ హౌజ్ కేసుకు సంబంధించిన ఆడియో టేపులను రిలీజ్ చేశారు. వాటిని సుప్రీం కోర్టు జడ్జీలు, అన్ని రాష్ట్రాల హైకోర్టు జడ్జీలు, జాతీయ దర్యాప్తు సంస్థలు, అన్ని రాష్ట్రాల డీజీపీలు, దేశవ్యాప్తంగా ఉన్న మీడియా సంస్థలకూ పంపుతున్నట్టు సీఎం స్పష్టం చేశారు. అయితే.. ఆ వీడియో టేపుల కారణంగానే సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని ప్రగతిభవన్‌కు సన్నిహితంగా ఉండే లీడర్లలో టెన్షన్ మొదలైంది. సీబీఐ విచారణలో భాగంగా కేసులో బాధితుడిగా ఉన్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వాటిని ఇచ్చారా ? లేక పోలీసులే అందించారా ? వాటిని ఎందుకు బహిర్గతం చేశారు ? ఇలాంటి అంశాలపై కేసీఆర్ నుంచి వివరణ తీసుకునే చాన్స్ ఉన్నట్టు లీగల్ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.

ఆ టేపులను ఎవరిచ్చారనే..

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్థన్ రెడ్డి, రేగ కాంతారావులను పార్టీ మారితే డబ్బులు ఇస్తామని బీజేపీ ప్రతినిధులుగా పరిచయం చేసుకున్న ముగ్గురు నిందితులు నందకుమార్, రామచంద్ర భారతి, సింహయాజీల మధ్య జరిగిన చర్చల ఆడియో టేపులను కేసీఆర్ రిలీజ్ చేశారు. ఇక వాటిని రికార్డు చేసిందెవరు? ఎవరు ఆదేశిస్తే కెమెరాలు అమర్చారు? ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఎప్పుడు ఫిర్యాదు చేశారు? చేయక ముందే కెమెరాలు పెట్టారా? ఆ తర్వాత బిగించారా? అనే విషయాలపైనా సైబరాబాద్ పోలీసులను కూడా సీబీఐ ప్రశ్నించనుంది. ఘటన జరిగిన చోట లభ్యమైన ఆధారాలను పంచనామా చేసిన రెవెన్యూ అధికారులను కూడా ఎంక్వైరీ చేయనుంది.

ఆ నలుగురికి నోటీసులు

పార్టీ మారితే పెద్ద ఎత్తున డబ్బులు ఇస్తారనే ఆశతో ఫామ్ హౌజ్‌కు వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవరర్థన్ రెడ్డి, రేగ కాంతరావులను సీబీఐ ప్రశ్నిస్తుందని న్యాయ నిపుణలు భావిస్తున్నారు. బీజేపీ ప్రతినిధులుగా పరిచయం చేసుకున్న ముగ్గురు నిందితులు ఎమ్మెల్యేలందరిని ఒకేసారి సంప్రదించారా? లేక విడివిడిగా సంప్రదించారా? ముందుగా ఎవరికి టచ్ లోకి వచ్చారు? డబ్బుల ఆఫర్ ఇచ్చిన విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తెచ్చారా? ఆయన ఏం అన్నారు? ఇలాంటి విషయాలను సీబీఐ ఎమ్మెల్యేల నుంచి రాబట్టనుంది.

కోర్టు ప్రశ్నిస్తే సిట్ మౌనం

కేసుకు సంబంధించి కీలక ఆధారాలైన వీడియో టేపులను సీఎంకు ఎవరు ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించగా సిట్ సమాధానం చెప్పలేకపోయంది. ఫామ్ హౌజ్ కేసును సీబీఐ విచారణకు చేపట్టిన తర్వాత సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించే చాన్స్ ఉన్నట్టు గతంలోనే అడ్వకేట్ జనరల్‌గా పనిచేసిన సీనియర్ అడ్వకేట్ పేర్కొన్నారు. విచారణ సంస్థల చేతుల్లో ఉండాల్సిన సాక్ష్యాలు ఇతర వ్యక్తులు చేతుల్లోకి వెళ్లడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

హడావుడిగా ప్రగతిభవన్‌కు..

సీఎం కేసీఆర్ బుధవారం హడావుడిగా ఫామ్ హౌజ్ నుంచి ప్రగతిభవన్‌కు వచ్చారు. షెడ్యూలు ప్రకారం ఆయన ఈనెల 30 వరకు అక్కడే ఉండాల్సి ఉంది. ఏదో ముఖ్యమైన పని ఉండటంతోనే ఉన్నఫళంగా ప్రగతిభవన్2కు వచ్చారని ప్రచారం జరుగుతున్నది. అయితే ఫామ్ హౌజ్ కేసులో హైకోర్టు తీర్పు పూర్తి వివరాలు మధ్యాహ్నం బయటికి వచ్చాయి. అందులో సిట్ విచారణపై కోర్టు లేవనెత్తిన అభ్యంతరాలు, సీబీఐకి ఎందుకు అప్పగించాల్సి వచ్చిందోననే వివరాలు ఉన్నాయి. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేసేందుకు ఉన్న అవకాశాలపై ప్రగతిభవన్ లో సీఎం న్యాయ నిపుణులు, సీనియర్ పోలీసు అధికారులతో సమావేశమైనట్టు తెలిసింది.

Tags:    

Similar News