త్రిముఖ పోటీలో విజేత ఎవరో? గెలుపుపై ఎవరి ధీమా వారిదే..!

కూకట్‌పల్లి నియోజకవర్గంలో గెలుపుపై ఎవరికి వారు మా పార్టీ గెలుస్తుందంటే మా పార్టీ గెలుస్తుందని ధీమాలో ఉన్నారు.

Update: 2023-12-02 02:36 GMT

దిశ, కూకట్‌పల్లి: కూకట్‌పల్లి నియోజకవర్గంలో గెలుపుపై ఎవరికి వారు మా పార్టీ గెలుస్తుందంటే మా పార్టీ గెలుస్తుందని ధీమాలో ఉన్నారు. మేము పదేళ్లు చేసిన అభివృద్ధి, సంక్షేమమే గెలిపిస్తుందని బీఆర్​ఎస్​నాయకులు ధీమాలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత, ఆరు గ్యారంటీలను ప్రజలు ఆదరిస్తున్నారు తప్పకుండా కాంగ్రెస్​ పార్టీ విజయం సాధిస్తుందని కాంగ్రెస్​నాయకులు ఓ వైపు గట్టిగానే వాదిస్తున్నారు.

ఇదంత ఒకలా ఉంటే కేంద్రంలోని బీజేపీ, పవర్​ స్టార్ పవన్​ కల్యాణ్ చరిష్మాతో జనసేన పార్టీ తప్పకుండా గట్టి పోటీ ఇచ్చింది తప్పకుండా జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి విజయం సాధిస్తారని జనసైనికులు నమ్మకంగా ఉన్నారు. నియోజకవర్గంలో గతంతో పోలిస్తే తక్కువగా పోలింగ్​జరగడంతో మూడు ప్రధాన పార్టీ అభ్యర్థులను కొంత గందరగోళానికి గురి చేసిన నియోజకవర్గంలో త్రిముఖ పోటీ జరిగిందనే చెప్పవచ్చు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కాంగ్రెస్, జనసేన పార్టీలు చీల్చడంలో సఫలీకృతం అయ్యారా అనేది డిసెంబర్​3న తెలుస్తుంది.

మందకొడిగా పోలింగ్​

పోలింగ్​ముగిసే వరకు కూకట్‌పల్లిలో 53.96 శాతం పోలింగ్​జరిగింది. పోలింగ్​తక్కువగా జరగడంతో ఏ డివిజన్‌లో ఏ వర్గం, ఎవరి ఓట్లు ఎవరికి పడ్డాయో లెక్కలు తేల్చుకునే పనిలో పడ్డారు అభ్యర్థులు. నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మూడు ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులు తమ బలాబలాలు పరీక్షించుకుంటున్నారు. డివిజన్ల వారీగా ఓట్లు కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలో అల్లాపూర్, ఓల్డ్​బోయిన్​పల్లి, మూసాపేట్, బాలానగర్, ఫతేనగర్, కూకట్​పల్లి ప్రాంతాలలో మైనారిటి ఓట్లు అధికంగా ఉంటాయి. ఈ ఓట్లపై బీఆర్ఎస్ పార్టీ గుప్పెడంత ఆశ పెట్టుకోగా ఈ సారి మైనారిటి ఓట్లను కాంగ్రెస్ పార్టీ కొల్లగొట్టిందనే చర్చ జరుగుతుంది.

అల్లాపూర్, ఓల్డ్​బోయిన్​పల్లికి చెందిన మైనారిటి ఓట్లు కాంగ్రెస్​పార్టీ అభ్యర్థికి అత్యధికంగా పడినట్టు సమాచారం, అదే విధంగా కేపీహెచ్‌బీ, బాలాజీనగర్​డివిజన్‌లలో అత్యధికంగా ఉండే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఓట్లు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు బీఆర్‌ఎస్​, కాంగ్రెస్, జనసేన పార్టీలు చీల్చుకున్నాయి. మూసాపేట్‌కు చెందిన శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ఓట్లు జనసేన పార్టీకి పడినట్టు తెలుస్తుంది. బాలానగర్, ఫతేనగర్, కూకట్‌పల్లి డివిజన్‌లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్​పార్టీలు సమానంగా ఓట్లు దక్కించుకున్నాయని సమాచారం. దీంతో కూకట్​పల్లిలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, జనసేన మూడు పార్టీల మధ్య త్రిముఖ పోటీ గట్టిగానే జరిగింది. డిసెంబర్​ 3వ తేదిన అభ్యర్ధుల భవితవ్యం తేలనున్నది.

ఏ ఓట్లు ఎవరికి?

కూకట్​పల్లి నియోజకవర్గంలో బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటి ఓట్లతో పాటు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాపు, కమ్మ, రాయలసీమ రెడ్డిల ఓట్లు తమ ఖాతాలో పడతాయని బీఆర్‌ఎస్​పార్టీ అభ్యర్థి మాధవరం కృష్ణారావు బలంగా నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్​పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసే సమయంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన గట్టి నాయకుడిని బీఆర్‌ఎస్​పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నాయకుడు బండి రమేష్‌ను ఎంపిక చేసి టికెట్​కేటాయించింది. అదే విధంగా నాటకీయ పరిణామాల మధ్య జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా రియల్​ఎస్టేట్​వ్యాపారి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్​బరిలో దిగిన విషయం తెలిసిందే.


Similar News