డీఎస్సీకి దరఖాస్తు చేసింది ఎందరు.. హాల్ టికెట్లు ఎక్కడా: అభ్యర్థులపై హైకోర్టు ప్రశ్నల వర్షం

డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలంటూ పది మంది విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన జస్టిస్ పుల్లా కార్తీక్ కీలక అంశాలను ప్రస్తావించారు.

Update: 2024-07-18 17:15 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలంటూ పది మంది విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన జస్టిస్ పుల్లా కార్తీక్ కీలక అంశాలను ప్రస్తావించారు. పిటిషన్ వేసిన పదిమంది అభ్యర్థుల్లో డీఎస్సీ పరీక్ష రాస్తున్నవారు ఎంతమంది?.. వారి హాల్ టికెట్లు పిటిషన్‌తో ఎందుకు జతచేయలేదు?.. కనీసం ఒక్కరు కూడా హాల్ టికెట్ వివరాలను పిటిషన్‌లలో ఎందుకు పొందుపర్చలేదు?... అంటూ వారి తరపున వాదించిన న్యాయవాది రవిచందర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులు పరీక్షలను వాయిదా వేయాలని కోరడం వెనక కారణమేంటి?... పరీక్షలు జరిగితే వారికి ఎదురయ్యే ఇబ్బందులేంటి?.. అని నిలదీశారు. దీనికి రవిచందర్ బదులిస్తూ... డీఎస్సీ నోటిఫికేషన్‌కు, పరీక్షకు మధ్య నాలుగు నెలల సమయం మాత్రమే ప్రభుత్వం ఇచ్చిందని, ఇంత తక్కువ వ్యవధిలో పరీక్షలకు ప్రిపేర్ కావడంలోని ఇబ్బందుల దృష్ట్యానే వాయిదా వేయాలని కోరుతున్నారని వివరించారు. గ్రూప్-1 పరీక్షను సైతం ఇదే తరహాలో నిర్వహించి అభ్యర్థులను గందరగోళానికి గురిచేసిందని, నాలుగు నెలల వ్యవధి ఉన్నా అనేక రకాల పోటీ పరీక్షలు రాయాల్సిన ఒత్తిడికి గురయ్యారని పేర్కొన్నారు.

ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు అడ్వొకేట్ జనరల్ రజనీకాంత్‌రెడ్డి జోక్యం చేసుకుని, పిటిషన్ దాఖలు చేసిన పది మంది డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నారని, కానీ ఈ పది మంది కోసం దాదాపు 2.45 లక్షల మంది నిరుద్యోగులకు ఇబ్బంది కలిగించలేమన్నారు. లక్షలాది మంది అభ్యర్థులు, నిరుద్యోగులు, విద్యార్థులు డీఎస్సీతో పాటు అనేక పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారని, ప్రస్తుతం వారు స్టడీలో మునిగిపోయారని, వారి సమయాన్ని వృథా చేయలేమన్నారు. టెట్ పరీక్షకు, డీఎస్సీ పరీక్షకు మధ్య నాలుగు వారాల సమయం ఉన్నదని వివరించారు. ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం జూన్ 3న టెట్ పరీక్షలను నిర్వహించిందంటూ అభ్యర్థుల తరఫున న్యాయవాది రవిచందర్ వ్యాఖ్యనించారు.

జస్టిస్ పుల్లా కార్తీక్ జోక్యం చేసుకుని... పిటిషన్ వేసిన పదిమంది డీఎస్సీ ఎగ్జామ్‌కు అప్లై చేశారా అని ప్రశ్నించారు. గ్రూప్-1 పరీక్షతో పాటు డీఏవో (డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ ఆఫీసర్) పోస్టులు, డీఎస్సీకి కూడా అప్లై చేశారని న్యాయవాది రవిచందర్ తెలిపారు. ఇన్ని పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉంటే డీఎస్సీకి సంబంధించిన హాల్ టికెట్లను కనీసం ఒక్క పిటిషనర్ (అభ్యర్థి) కూడా ఎందుకు వారి పిటిషన్లతో జత చేయలేదని ప్రశ్నించి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరు తరఫున వాదనలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ కార్తీక్... తదుపరి విచారణను ఆగస్టు 28కి వాయిదా వేశారు.

Tags:    

Similar News