రూ.100 కోట్లు నీకెక్కడివి? మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై నెటిజన్ల ప్రశ్నలు

లోక్ సభ ఎన్నికల నగారా మోగడంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది.

Update: 2024-03-27 08:03 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : లోక్ సభ ఎన్నికల నగారా మోగడంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత ఇలాకా మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఇక్కడి నుంచి సిద్దిపేట మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి పేరును ఖరారు చేశారు. ఈ క్రమంలో తాను మెదక్ ఎంపీగా గెలిచిన తరువాత రూ.100 కోట్లతో పీవీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి, నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తానని వెంకట్రామిరెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పుడీ వ్యాఖ్యలే పొలిటికల్ కారిడార్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ. 17 కోట్లలోపే ఉందని, అలాంటప్పుడు ట్రస్ట్ కోసం రూ. వంద కోట్లు ఎక్కడి నుంచి తీసుకువస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ప్రతిపక్షాలకు అస్త్రం..

మరోవైపు మెదక్ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డిని ఎంపిక చేయడం పట్ల సొంత పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి మెదక్ నుంచి కేసీఆరే స్వయంగా పోటీలో ఉంటారని లేనిపక్షంలో కల్వకుంట్ల కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు బరిలో ఉంటారనే టాక్ మొదట్లో వినిపించింది. కానీ కేసీఆర్ మాత్రం అనూహ్యంగా వెంకట్రామిరెడ్డి పేరును తెరపైకి తీసుకువచ్చారు. గతంలో సిద్దిపేట కలెక్టర్‌గా పనిచేసిన ఆయన తన పదవికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోగా ఏడాది తిరగకుండానే కేసీఆర్ ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చారు. అయితే కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో వెంకట్రామిరెడ్డి మల్లన్న సాగర్ భూ నిర్వాసితులను నరకయాతన పెట్టారని, పరిహారం చెక్కుల విషయంలో చుక్కలు చూపించారనే విమర్శలు పెద్దఎత్తున వినిపించాయి. దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి వెనుక వెంకట్రామిరెడ్డి వైఖరి ఓ కారణమనే చర్చ అప్పట్లో బలంగా వినిపించిది. అలాంటి వ్యక్తికే కేసీఆర్ తిరిగి మరో అవకాశం ఇవ్వడం రాంగ్ చాయిస్ అనే వాదన బలంగా వినిపిస్తోంది.

సహకారం డౌటే?

మెదక్ అభ్యర్థిపై బీఆర్ఎస్‌లోని ఆశావహులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు ఇవ్వకపోవడంపై నర్సాపూర్ తాజా మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డితో పాటు మరికొంతమంది అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఏళ్లుగా పార్టీకి సేవలు చేస్తున్న తమను కాదని ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తికే మరోసారి టికెట్ ఇవ్వడం ఏంటని తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. వీరిలో కొందరు బీఆర్ఎస్‌ను వీడి.. కాంగ్రెస్‌లో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ మారినా మారకపోయినా అభ్యర్థికి సహకరించే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజా పరిస్థితిని వెంకట్రామిరెడ్డి ఎలా హ్యాండిల్ చేస్తారో అనేది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News