వైరా మున్సిపాలిటీ సాధారణ సమావేశం ఎప్పుడో..?

అనేక అవినీతి ఆరోపణలతో నిరంతరం చర్చనీయాంశంగా మారిన వైరా మున్సిపాలిటీ కనీసం సాధారణ సమావేశానికి నోచుకోవటం లేదు.

Update: 2023-04-11 02:42 GMT

దిశ, వైరా : అనేక అవినీతి ఆరోపణలతో నిరంతరం చర్చనీయాంశంగా మారిన వైరా మున్సిపాలిటీ కనీసం సాధారణ సమావేశానికి నోచుకోవటం లేదు. ఒక నెల కాదు.... రెండు నెలలు కాదు... ఏకంగా 4 నెలలు గడిచినా సాధారణ సమావేశాన్ని నిర్వహించాలనే కనీస ఆలోచన ఇక్కడ పనిచేసే అధికారులు చేయటం లేదు. ఈ ఏడాది జనవరి 11వ తేదీన వైరా మున్సిపాలిటీ చివరి సాధారణ సమావేశం నిర్వహించారు.

అప్పటి నుంచి ఇప్పటి వరకు సమావేశం ఏర్పాటు చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కౌన్సిలర్లు సాధారణ సమావేశం జరపాలని పట్టుబడుతున్నా... అధికారులు మాత్రం తమ అవినీతి అక్రమాలపై కౌన్సిలర్లు నిలదీస్తారనే భయంతో నిబంధనలకు విరుద్ధంగా సమావేశాలు కూడా నిర్వహించడం లేదు. దీంతో ఇక వైరా మున్సిపాలిటీలో ఇక సాధారణ సమావేశం నిర్వహిస్తారా....? లేదా...? అనే చర్చ తీవ్రంగా కొనసాగుతుంది.

అవినీతి అక్రమాలపై నిలదీస్తారనే..

వైరా మున్సిపాలిటీలో నెలకొన్న అనేక అవినీతి, అక్రమాలపై కౌన్సిలర్లు తమను నిలదీస్తారనే భయంతోనే ఓ అధికారి నెలల తరబడి సాధారణ సమావేశం నిర్వహించకుండా తన ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఇక్కడ ఇటీవల వరకు ఇంచార్జ్ కమిషనర్‌గా పనిచేసిన బి.అనిత హయాంలో అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. సోమవారం గ్రామంలో కౌన్సిల్ తీర్మానం లేకుండా, ఇంజనీరింగ్ అధికారుల ధ్రువీకరణ పత్రం లేకుండా మంచినీటి ట్యాంక్ కూల్చివేత విషయమై గత ఫిబ్రవరి 22వ తేదీన 16 మంది కౌన్సిలర్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ ట్యాంకు సంబంధించిన స్క్రాప్‌ను పాత ఇనుము దుకాణంలో విక్రయించారు. ఈ ట్యాంకు కూల్చివేతలో లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా వైరా మున్సిపాలిటీలో భద్రపరిచిన లక్షలాది రూపాయలు విలువ చేసే స్క్రాప్ ఆమె కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలోనే మాయమైంది. పట్టు పరిశ్రమ కార్యాలయం స్క్రాప్ కనిపించకుండా పోయింది. దొడ్డిదారిన విధుల్లోకి తీసుకున్న ముగ్గురు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా ఓ అధికారి వాంగ్మూల పత్రాలను రాయించటం ఇక్కడ వివాదాస్పదమైంది.

సొంత కారులో తిరిగిన అధికారి సునీత ట్రావెల్స్ పేరుతో రెండు నెలలు నగదు విత్ డ్రా చేయడం చర్చనీయాంశం అయింది. అంతేకాకుండా మున్సిపాలిటీలోని వాహనాల మెయింటినెన్స్ పేరుతో లక్షలాది రూపాయలను నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు చేశారనే ఆరోపణలు ఉండనే ఉన్నాయి. అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని తీసుకునేందుకు విఫల యత్నం చేశారు. వీటితోపాటు అనేక ఆరోపణలు మున్సిపాలిటీలోని అధికారిని చుట్టుముట్టాయి. సాధారణ సమావేశం నిర్వహిస్తే ఈ అన్ని అంశాలపై కౌన్సిలర్లు తనని నిలదీస్తారనే భయంతో ఓ అధికారి సమావేశం నిర్వహించకుండా ఇప్పటివరకు తప్పించుకున్నారు.

కొత్త కమిషనర్ అయినా సమావేశం నిర్వహించేనా..?

వైరా మున్సిపాలిటీ కమిషనర్ గా ఈనెల 7వ తేదీన పతాని వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇన్ఛార్జి కమిషనర్ గా పనిచేసిన బి.అనిత గత నాలుగు నెలలుగా సాధారణ సమావేశాన్ని నిర్వహించకపోవడం విశేషం. ప్రస్తుతం బాధ్యతలు తీసుకున్న నూతన కమిషనర్ అయినా సాధారణ సమావేశం నిర్వహిస్తారా...? లేదా...,? అనే చర్చ పాలకవర్గంతో పాటు వైరా ప్రజల్లో తీవ్రంగా జరుగుతుంది. ఆయన కూడా సమావేశం నిర్వహించుకుంటే కౌన్సిలర్లు ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మున్సిపాలిటీ సాదారణ సమావేశం కనీసం నిర్వహించినప్పుడు తాము కౌన్సిలర్లుగా ఎందుకు కొనసాగాలో అధికారులు చెప్పాలని పాలకవర్గ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా నూతన కమిషనర్ అయిన సాధారణ సమావేశ నిర్వహిస్తారా...? లేదా...? అనే విషయం వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News