బండి వ్యాఖ్యల వెనక మర్మమేంటి! హరీశ్‌రావుకు సొంత పార్టీలో చెక్ పెట్టేందుకేనా..?

లోక్‌సభ ఎలక్షన్స్‌లో 8 పార్లమెంటు సెగ్మెంట్లలో గెలిచిన బీజేపీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటాలని వ్యూహరచన చేస్తోంది.

Update: 2024-07-18 02:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : లోక్‌సభ ఎలక్షన్స్‌లో 8 పార్లమెంటు సెగ్మెంట్లలో గెలిచిన బీజేపీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటాలని వ్యూహరచన చేస్తోంది. లోకల్ బాడీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించాలని ఒకవైపు బీజేపీ.. మరో వైపు కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే జాయినింగ్స్‌పై ఫోకస్ పెట్టిన హస్తం పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలను కొనసాగిస్తూనే ఉంది. ఈ తరుణంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మాజీ మంత్రి హరీశ్‌రావుపై ప్రశంసలు కురిపించడం వెనక ఉన్న ఉద్దేశమేంటనేది ఆసక్తికరంగా మారింది. హరీశ్‌‌రావును మంచి వ్యక్తి అని, ప్రజాబలం కలిగిన నేత అని కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశంపై కమలనాథుల్లో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఈ వ్యాఖ్యలు చేయడం వెనక ఉద్దేశమేంటని చెవులు కొరుక్కుంటున్నారు.

టాక్ ఆఫ్ ది స్టేట్‌గా కేంద్ర మంత్రి వ్యాఖ్యలు

తెలంగాణలో పార్టీని విస్తరించి మరింత బలపడాలని కాషాయ పార్టీ భావిస్తోంది. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సంజయ్ వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ది స్టేట్‌గా మారాయి. కొద్ది రోజులుగా బీజేపీలో..బీఆర్ఎస్ పార్టీ విలీనం అని జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే..అందులో భాగంగానే బండి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్. ముందుగా ఒక రాయి వేసి చూస్తే రెస్పాన్స్‌ను బట్టి తదుపరి కార్యాచరణకు పూనుకోవచ్చని భావించి ఇలా చేసి ఉంటారనే చర్చ జరుగుతోంది. అయితే, ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ‘కారు’ దిగి హస్తం పార్టీలో చేరారు. కాగా, గులాబీ పార్టీలో మిగిలిన నేతలు బీజేపీలో చేరడంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ కూడా ఘాటుగానే స్పందించింది. తెలంగాణలోనూ ఏక్‌నాథ్ షిండే ప్రయోగం చేస్తోందంటూ విమర్శలు గుప్పిస్తోంది.

3 పార్టీల్లో కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై డిస్కషన్

టీ బీజేపీలోనూ బండి వ్యాఖ్యలపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా చర్చించుకుంటున్నారు. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, హరీశ్‌రావుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందని, అందుకే రఘునందన్ హరీశ్‌పై నిత్యం విరుచుకుపడుతారని టాక్. కాగా బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్‌గా ఉన్న తరుణంలో సంజయ్ తీసుకున్న పలు నిర్ణయాలను రఘునందన్‌రావు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నేతకు చెక్ పెట్టడంలో భాగంగా బండి సంజయ్..హరీశ్‌రావుపై ప్రశంసల వర్షం కురిపించారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

శత్రువుకి శత్రువు మిత్రుడు అనే నానుడిని నిజం చేయబోతున్నారా? లేక హరీశ్ లాంటి ప్రజాబలం ఉన్న లీడర్‌ను పొగిడి.. కాంగ్రెస్‌ను డిఫెన్స్‌లో పడేలా చేయడంలో భాగంగా పన్నిన వ్యూహమా? అనేది సస్పెన్స్‌గా మారింది. బండి సంజయ్ ప్రశంసలు హరీశ్‌రావును కూడా ఇరకాటంలో పెట్టాయి. గులాబీ పార్టీలోనూ ఈ అంశంపై పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. నిజంగానే ఏక్‌నాథ్ షిండే అవుతారా? అని చెవులు కొరుక్కుంటున్నారు. మొత్తానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు మూడు పార్టీల్లో చర్చనీయాంశమయ్యాయి. భవిష్యత్‌లో రాజకీయం ఎలాంటి మలుపులు తీసుకోనుందో చూడాలి.


Similar News