కేసీఆర్, జగన్ ఫ్యూచరేంటి? ఒంటరి పోరుతో బిగ్ డ్యామేజీ! కూటమిలో చేరికపై ఆ తర్వాతే నిర్ణయమా?
లోక్ సభ ఎన్నికలు కేసీఆర్, జగన్ రాజకీయ భవిష్యత్ కు చాలెంజ్ విసిరాయి.
దిశ, డైనమిక్ బ్యూరో : లోక్‌సభ ఫలితాలు పలు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కకపోవడంతో దేశంలో మరోసారి సంకీర్ణ ప్రభుత్వానికి తెరలేచింది. మిత్రపక్షాలతో బలంగా ఉన్న ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం అవుతుంటే, ప్రస్తుతానికి ప్రతిపక్షంలోనే ఉంటామని సరైన సమయంలో ముందడుగు వేస్తామని ఇండియా కూటమి స్పష్టం చేసింది. అయితే ఇటు ఎన్డీయే అటు ఇండియా కూటములను కాదని ఒంటరిగా వెళ్లిన పార్టీలకు పార్లమెంట్ ఎన్నికల్లో భారీ దెబ్బ తగిలింది. బీఆర్ఎస్, వైసీపీతో పాటు బీఎస్పీ, తమిళనాడులో అన్నాడీఎంకే వంటి పార్టీలకు ఊహించని డ్యామేజీ జరిగింది. ఈ నేపథ్యంలో నిన్నటి వరకు రాష్ట్రాలను పరిపాలించిన బీఆర్ఎస్, వైసీపీల అధినేతలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది హాట్ టాపిక్‌గా మారింది.
మనుగడకే ఎసరు..
పదేళ్లపాటు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోగా, లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కసీటూ గెలవలేక తొలిసారి లోక్‌సభలో ప్రాతినిధ్యాన్ని కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 37 శాతం ఓటు పర్సెంటేజ్ ఉండగా ఎంపీ ఎన్నికల్లో అది 16.08 శాతానికి పడిపోయింది. కాంగ్రెస్ 39 నుంచి 40 శాతానికి ఓట్ల శాతాన్ని పెంచుకోగా, బీజేపీ14 నుంచి 35.08 శాతానికి పెంచుకోగలిగింది. దీంతో ఏదో ఓ కూటమి వైపు ఉండి ఉంటే బీఆర్ఎస్‌కు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు కదా అనే చర్చ కూడా తెరపైకి వస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ మనుగడ కోసం ఈ రెండు కూటములలో ఏదో ఒకదాని వైపు చేరుదామని భావించినా ఒక్క ఎంపీ సీటు కూడా బీఆర్ఎస్‌ను ఎవరు చేరదీస్తారనేది సందేహంగా మారింది.
ఒంటరి పోరు వల్లే వైసీపీ ఓటమి?
మరోవైపు ఏపీలో వైసీపీ ఓటమికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడటమే ప్రధాన బలం అనేది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైసీపీ ఒంటరిగా వెళ్లడం వల్లే చావుదెబ్బ తిన్నదని లేకుంటే పరిస్థితి మరోలా ఉండేదని లెక్కలు వేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న మొన్నటి వరకు అధికారం చెలాయించి రాష్ట్ర రాజకీయాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన బీఆర్ఎస్, వైసీపీలు రాబోయే రోజుల్లోనూ ఒంటరిగానే వెళ్తాయా? లేక కూటములవైపు మొగ్గు చూపుతాయా? అనేది తెలియాల్సి ఉంది.
ఆ ఎన్నికల తర్వాతే కేసీఆర్ నిర్ణయం?
రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ పుంజుకుంటుండగా బీఆర్ఎస్ తన టు బ్యాంక్‌ను క్రమంగా కోల్పోతున్నది. ఈ క్రమంలో పలువురు బీఆర్ఎస్ ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తిరిగి పార్టీని నిలబెట్టేందుకు కేసీఆర్ కూటములను ఆశ్రయిస్తారా లేక ఒంటరిగానే సాగుతారా అనేది తేలాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే ఈ విషయంలో గులాబీ బాస్ నిర్ణయం తీసుకుంటారనే చర్చ నడుస్తోంది. ఎంపీ ఎన్నికలు జాతీయ స్థాయి అంశాలతో ముడిపడిన వ్యవహారం కావడం వల్ల కాంగ్రెస్, బీజేపీలు ప్రభావం చూపగలిగాయని కానీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్‌కే చాన్స్ ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారన్న చర్చ జరుగుతోంది.