హడావుడిగా పరీక్షలు.. డీఎస్సీ రిజల్ట్స్ ఏమైంది? ఆర్ఎస్పీ ఆసక్తికర ట్వీట్
వన్ వీక్‌లో డీఎస్సీ రిజల్ట్స్ ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పి నెలలు అయిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: వన్ వీక్‌లో డీఎస్సీ రిజల్ట్స్ ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పి నెలలు అయిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. అలాగే సెప్టెంబర్ 5 వరకే నియామకాలు చేపడతామని కూడా చెప్పారన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఆఘమేఘాల మీద డీఎస్సీ పరీక్షలు జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్లైన్ (సీబీటీ) లో నిర్వహించారని తెలిపారు. చాలా మంది అభ్యర్థులు వాయిదా వేయాలని వేడుకున్నా, ప్రభుత్వం మాకు టీచర్లు తొందరగా అవసరమున్నది అని హడావుడిగా నిర్వహించిందన్నారు.
అంతా ఆన్లైన్ పరీక్ష అయినప్పుడు దీనికి సంబంధించిన నియామక భర్తీ ప్రక్రియ ఎందుకు నత్త నడకన సాగిస్తోందని ప్రశ్నించారు? రిజల్ట్స్ తొందరగా ఇచ్చి, జనరల్ ర్యాంకింగ్స్ ఇచ్చి, నియామక పత్రాలు అందజేస్తే వారు బడుల్లోకి పోయి పిల్లలకు పాఠాలు బోధిస్తారు కదా అని అభిప్రాయపడ్డారు. గురుకులాల టీచర్లకే ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, వీళ్లకు ఎక్కడి నుంచి ఇస్తాం అని.. హైడ్రా పేరుతో అందరి దృష్టి మళ్లించి తర్వాత వచ్చే సంవత్సరం నియామక పత్రాలు ఇద్దామని కుట్ర చేస్తున్నట్లుగా అనిపిస్తున్నదని పేర్కొన్నారు. అసలు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు ఎవరు? ఆయన ఏ ప్రపంచంలో సేదతీరుతున్నారు? విద్యాశాఖ మంత్రి లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.