CM Revanth Reddy: జనరల్ ట్రాన్స్‌ఫర్స్‌లో అసలు సమస్యలేంటి?.. ఆరా తీసిన సీఎం రేవంత్‌రెడ్డి

వైద్య, ఆరోగ్య శాఖలోని సాధారణ బదిలీల్లో ఆందోళనకు గల కారణాలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీసినట్లుగా సమాచారం.

Update: 2024-07-22 02:17 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వైద్య, ఆరోగ్య శాఖలోని సాధారణ బదిలీల్లో ఆందోళనకు గల కారణాలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీసినట్లుగా సమాచారం. ఆరోగ్య శాఖలోనే ఎందుకు ఈ హడావిడి నెలకొన్నదని ఉన్నతాధికారులను అడిగారు. గందరగోళ పరిస్థితులపై నివేదిక కోరినట్లుగా తెలిసింది. జనరల్ ట్రాన్స్‌ఫర్ల ప్రాసెస్‌లో ఏ శాఖలో లేని ఆందోళనలు ఇక్కడే ఎందుకు జరుగుతున్నాయని సీఎం అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో సీఎంకు వివరాలు ఇచ్చేందుకు ఉన్నతాధికారులు సిద్ధం అవుతున్నారు. జనరల్ ట్రాన్స్‌ఫర్లకు తేదీలను పెంచడానికి కూడా తమ శాఖనే కారణమైనదని వైద్య, ఆరోగ్య శాఖలోని ఓ ఆఫీసర్ తెలిపారు. పబ్లిక్ హెల్త్ విభాగంలో జరిగిన కౌన్సెలింగ్ దారుణమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్టాఫ్ నర్సుల సీనియారిటీ లిస్టును నాలుగు సార్లు రివైజ్ చేసినా తప్పులు తేలడం ఆయా అధికారుల నిర్లక్ష్యమేనని వివరించారు.

డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిన్) కేడర్‌లో కేవలం 13 మంది ఉండగా, వీరి బదిలీల్లోనూ రూల్స్‌కు విరుద్ధంగా ట్రాన్స్‌ఫర్స్ జరిగినట్లు ప్రభుత్వం దృష్టిలో ఉందన్నారు. స్పౌజ్‌లు లేకున్నా, ఉన్నట్లు పరిగణించడం దారుణమని పేర్కొన్నారు. పైగా జీవో నం.80 ప్రకారం హైదరాబాద్‌లో ఎక్కువ కాలం పని చేసినోళ్లను బదిలీ చేయాలని ఉంది. డీడీ అడ్మిన్ కేడర్‌లోని ఇద్దరిని ఏకంగా హెడ్ ఆఫీస్‌కు ఎలా వేస్తారని ఆయన ప్రశ్నించారు. ఆ ఇద్దరికీ స్పౌజ్ లేకున్నా, హైదరాబాద్‌లోనే ఉంచారని ఆరోపించారు. ఓ యూనియన్, ఓ హెచ్‌వోడీ, ఓ డీడీ, స్టాఫ్‌ నర్సు అసోసియేషన్‌లోని కొందరు.. ఇలా అందరి ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నట్లు అనుమానం ఉందన్నారు. ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని విచారణ తరువాతే బదిలీలు చేయాలని కోరారు. అప్పటి వరకు కౌన్సెలింగ్‌లో ఇచ్చిన పోస్టింగులను తాత్కాలికంగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News