రోడ్డు భద్రత పై కఠినంగా వ్యవహరిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

రోడ్డు భద్రత పై కఠినంగా వ్యవహరిస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

Update: 2024-09-08 14:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రోడ్డు భద్రత పై కఠినంగా వ్యవహరిస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ రవాణా శాఖ సాంకేతిక అధికారుల సర్వసభ్య సమావేశం(తెలంగాణ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం)ను హైదరాబాద్ లోని సెంట్రల్ కోర్టు హాల్ లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి చర్యలు చేపట్టామన్నారు. కేంద్ర రవాణా చట్టం 1988 కి అనుగుణంగా రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు నిబంధనలు కఠినతరం చేస్తామన్నారు. రవాణా శాఖలో పెండింగ్ ఉన్న ప్రమోషన్లు ఇతర సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రవాణా శాఖ సిబ్బంది ఎలాంటి వేధింపులు లేకుండా ఇతరత్రా కార్యక్రమాలు జరగకుండా చట్టాన్ని కఠినంగా అమలు చేస్తూ రాష్ట్ర ఆదాయాన్ని పెంపొందించుకునేలా చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాలు, కోల్పోతున్న ప్రాణాలను కాపాడడానికి రోడ్డు భద్రత పై అవగాహన కల్పిస్తూ రవాణా శాఖ అధికారులు, సిబ్బంది శ్రమించాలని సూచించారు. సుప్రీంకోర్టు మార్గర్శకాలను ఉపయోగిస్తూ మోటారు వాహనాల చట్టం 1988 కి అనుగుణంగా 6936 డ్రైవింగ్ లైసెన్సులు ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 వరకు రద్దు చేయడం జరిగిందన్నారు. భవిష్యత్ లో దీనిని మరింత కఠినతరం చేస్తామని స్పష్టం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్, రోడ్డు ప్రమాదాలు, సిగ్నల్ జంపింగ్ ఇతర సుప్రీంకోర్టు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తూ లైసెన్స్ ల రద్దుతో పాటు ఇంకా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

రవాణా శాఖ నిబంధనలను అతిక్రమిస్తే పాశ్చాత్య దేశాల్లో అమెరికా లో డ్రైవింగ్ లైసెన్స్ రద్దు తో పాటు ఇంకా కఠిన శిక్షలు ఉంటాయని తెలిపారు. ఇక్కడ కూడా అటువంటి చట్టాలు తెచ్చి ప్రమాదాలను నివారించే విధంగా రవాణా శాఖ యావత్ సిబ్బంది తమ పని విధానంలో మార్పులు తెచ్చి ఇంకా పని చేయాలని సూచించారు. ట్రాఫిక్ రూల్స్ ఇతర నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు అవుతుందనే భయం పౌరుల్లో రావడానికి రోడ్డు సేఫ్టీ, యూనిసెఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం పక్షాన విద్యా శాఖ నుంచి పాఠశాలలో కూడా అవగాహన కల్పిస్తామన్నారు. రవాణా శాఖ ఎన్ ఫోర్స్ మెంట్ ప్రమాదాలను నివారించడం తో పాటు ప్రజలను రక్షించడానికి అవసరమైన విధి విధానాలపై రూపకల్పన చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని, ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ప్రాణాలను రక్షించడానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు.

కేంద్రంలో వాహన చట్టం కింద 28 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నవి ఇక్కడ చేస్తున్నామని, కొన్ని సంస్కరణలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. పొల్యూషన్ పై కఠినంగా వ్యవహరించేలా చేస్తామని, వెహికిల్ చెకింగ్ పై ఆటోమేటిక్ చెకింగ్ తప్పనిసరి చేస్తామని వెల్లడించారు. ఉద్యోగుల్లో ప్రమోషన్లు వృత్తి రీత్యా పెండింగ్ లో ఉన్న అంశాలు తొలగిస్తామని, వారి అసహనాన్ని తొలగించి సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. వాహనాల ఫిట్నెస్ పై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జేటీసీ రమేష్, తెలంగాణ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి. రవీందర్ కుమార్ గౌడ్, గౌరవాధ్యక్షుడు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ మార్గం రవీందర్, ట్రెజరర్ చంద్రశేఖర్ గౌడ్, జాయింట్ సెక్రెటరీ జే. శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ వెంకట పుల్లయ్య, కొండయ్య తో పాటు జేటీవోలు, డీటీసీలు, ఆర్టీవోలు పాల్గొన్నారు


Similar News