Bhatti Vikramarka: అలాంటి పరిశ్రమలన్నీ ఓఆర్ఆర్ బయటకే.. డిప్యూటీ సీఎం భట్టి
మహావీర్ అంతర్జాతీయ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా సేవలు అందిస్తున్న సామాజిక సంస్థలకు ప్రజా ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) చెప్పారు. సామాజిక పరివర్తన కోసం ఎటువంటి లాభాపేక్ష లేకుండా మహావీర్ జైన్ సంస్థ పనిచేయడం, చిన్నారులు, మహిళల సాధికారికత కోసం, వైద్య సహకారం అవసరమైన వారికి ఉచితంగా సేవలు అందించడానికి అభినందించారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని ఓ కన్వెన్షన్‌లో 30వ మహావీర్ అంతర్జాతీయ సదస్సులో (MAHAVIR INTERNATIONAL APEX) భట్టి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం కూడా విద్యార్థులు, మహిళలు, వైద్య రంగాల్లో విశిష్ట కృషి చేస్తుందని తెలిపారు. మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడానికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించినట్టు చెప్పారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రతి సంవత్సరం రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని, అందులో భాగంగా మొదటి సంవత్సరం రూ.19 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇప్పటికే స్వయం సహాయక సంఘాలకు అందించినట్లు వెల్లడించారు. ఇలా ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకుపోతున్నట్టు వివరించారు. ఉచిత విద్య, వైద్య రంగాల్లో ప్రజలకు ప్రయోజనం కలిగించేలా విశేష కృషి చేస్తోందన్నారు.
క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా హైదరాబాద్
హైదరాబాద్‌ను (Hyderabad) కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతున్నామని, ఇందులో భాగంగా కాలుష్య కారకమైన పరిశ్రమలను (polluting industries) ఔటర్ రింగ్ రోడ్డు బయటకు తరలిస్తున్నామని భట్టి విక్రమార్క అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం కారణంగా నివాసానికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయని, అటువంటి పరిస్థితులు హైదరాబాద్‌లో తలెత్తకుండా క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి కొత్త విద్యుత్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీసుకురాబోతుందన్నారు.