దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మధ్యప్రదేశ్ కు చెందిన యువతి చేసిన ఆరోపణలపై తెలుగు ఫిలిం చాంబర్ అధికారికంగా స్పందించింది. తాజాగా ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ మీడియా సమావేశం నిర్వహించింది. తమ్మారెడ్డి భరద్వాజ, ఝూన్సీ, ఫిలిం చాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. జానీ మాస్టర్ మీద ఆరోపణలు రావడంతో ఈ వివాదం తేలే వరకు అతన్ని డ్యాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఫెడరేషన్ ను ఇప్పటికే ఆదేశించామని వారు తెలిపారు. ఐదేళ్ల పాటు ఆ అమ్మాయి నరకం చూసిందని.. యువతి తల్లిదండ్రుల నుంచి కూడా సమాచారం సేకరించామని.. దీనిపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి జానీపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి యాంకర్, నటి ఝాన్సీ స్పందించారు. మన ఇండస్ట్రీలో మహిళా రక్షణ కోసం సరైన గెడ్ లైన్స్ లేవన్నారు. నటి శ్రీ రెడ్డి ఇష్యూ తరువాత ఒక కమిటీ ఫామ్ అయిందని, జానీ మాస్టర్ ఇష్యూ తెరపైకి వచ్చిన వెంటనే ఆ కమిటీ వారు పరిశీలన చేస్తున్నారని, ఈ వివాదంలో బాధితురాలు తొలుత తన వర్క్ పరంగా ఇబ్బంది అని ముందుకు వచ్చిందని, ఆ తర్వాత లైంగిక వేధింపులు కూడా ఉన్నాయని ఫిర్యాదు చేసిందని ఝాన్సీ పేర్కొన్నారు. ఆ అమ్మాయి స్టేట్మెంట్ తో పాటు జానీ మాటలను కూడా రికార్డు చేశామని, అయితే, లైంగిక వేధింపులు అనేది వర్క్ లోకేషన్ లో జరగలేదని, ఆ అమ్మాయి ఇప్పటికే లీగల్ గా ముందుకు వెళ్తుందని చెప్పారు. అయితే మీడియా బాధితురాలి ఫోటోలను రివీల్ చేయవద్దని కోరుతున్నామని, విచారణ సాగుతుందని, 90రోజుల్లో దీనిపై పూర్తి క్లారిటీ వస్తుందని ఝాన్సీ తెలిపారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. 'మొదట మీడియా వారి నుంచే జానీ మాస్టర్ వివాదం మా వద్దకు వచ్చిందన్నారు. ఇండస్ట్రీలో ఇబ్బందులు పడే వారి కోసం 2013లో అసరా అని పెట్టి.. 2018లో దాని స్థానంలో తెలుగు ఫిలిం చాంబర్ అఫ్ కామర్స్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ ఏర్పాటు చేసిందని, అయితే ఇండస్ట్రీలో ఒక మహిళకు ధైర్యం ఇవ్వలేకపోతున్నామన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలోని ప్రతి అమ్మాయికి ఆపద వస్తే తమకు సపోర్ట్ ఉందనే భరోసా కల్పించాలని, అందుకు తగ్గ కమిటీ నిర్ణయాలు ఉండాలని, కచ్చితంగా 90 రోజుల్లోనే జానీ మాస్టర్ కేసు పూర్తి అవుతుందని స్పష్టం చేశారు. సినిమా ఇండస్ట్రీలో ప్రతి అమ్మాయికి రక్షణ కావాలని, చాంబర్ తరపున ప్రతి యూనియన్ కు ఓ కంప్లయింట్ కమిటీ పెట్టుకోవాలని ఈ సందర్భంగా సూచిస్తున్నామన్నారు. డ్యాన్సర్ యూనియన్ వారు కూడా ఈ విషయంలో మాతో పూర్తి సహకారాన్ని అందిస్తున్నారని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు.