జర్నలిస్టుల పట్ల పోలీసుల తీరును ఖండిస్తున్నాం!.. బీఆర్ఎస్ నేత హరీష్ రావు ట్వీట్
జర్నలిస్టుల పట్ల పోలీసుల తీరును ఖండిస్తున్నామని, వారిని అరెస్ట్ చేయడం, మీడియా స్వేచ్ఛను కాలరాయడమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో:జర్నలిస్టుల పట్ల పోలీసుల తీరును ఖండిస్తున్నామని, వారిని అరెస్ట్ చేయడం, మీడియా స్వేచ్ఛను కాలరాయడమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ ప్రాంగణం వద్ద విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్ట్ ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన వీడియోతో పాటు పలు సందర్భాల్లో జర్నలిస్టులపై పోలీసుల తీరుకు సంబందించిన వీడియోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీనిపై ఆయన.. ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. అలాగే డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే, విధి నిర్వహణలో భాగంగా ఆ వార్తలు కవర్ చేయడమే వారు చేసిన తప్పా? అని ప్రశ్నించారు. జర్నలిస్టులను అరెస్టు చేయడం, బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించడం మీడియా హక్కును, స్వేచ్ఛను కాలరాయడమేనని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని మార్చుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.