Minister Uttam : ఏడాదికి 30లక్షల కొత్త ఆయకట్టుకు నీళ్లు : మంత్రి ఉత్తమ్
రాష్ట్రంలో గత ప్రభుత్వంలో పదేళ్లలో 1.81లక్షల కోట్లు ఖర్చు చేశారని.. ఎక్కువ ఖర్చుతో తక్కువ ఆయకట్టు తెచ్చారని, మా ప్రభుత్వం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించేలా ప్రయత్నం చేస్తున్నామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy))స్పష్టం చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో గత ప్రభుత్వంలో పదేళ్లలో 1.81లక్షల కోట్లు ఖర్చు చేశారని.. ఎక్కువ ఖర్చుతో తక్కువ ఆయకట్టు తెచ్చారని, మా ప్రభుత్వం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించేలా ప్రయత్నం చేస్తున్నామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy))స్పష్టం చేశారు. అసెంబ్లీ(Assembly)లో ఇరిగేషన్ శాఖపై చర్చకు ఆయన సమాధానమిచ్చారు. తమ ప్రభుత్వం ఏడాదికి కొత్తగా 30లక్షల ఆయకట్టుకు సాగునీరందించే లక్ష్యంతో తగిన ప్రణాళికలతో ముందుకెలుతున్నామన్నారు. బస్వాపురం రిజర్వాయర్ నిర్వాసితులకు గత ప్రభుత్వం 100కోట్ల ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజీ పెండింగ్ లో పెడితే తాము 50కోట్లు ఇప్పటికే విడుదల చేశామని, నిర్వాసితుల కోసం తీసుకోవాల్సిన చర్యలన్ని పూర్తి చేస్తామన్నారు. కాలువ హైవే క్రాసింగ్ పరిశీలన చేస్తున్నామన్నారు. గంధమల్ల ప్రాజెక్టును 1.5టీఎంసీకి తగ్గించి పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు.
దేవాదుల కాల్వను పూర్తి చేయిస్తామని, స్టేషన్ ఘనపూర్ వద్ద 120కోట్లు మంజూరు చేశామని తెలిపారు. మలక్ పేట రిజర్వాయర్, శ్రీపాద ఎల్లంపల్లి పెండింగ్ పనులు పూర్తి చేయిస్తామన్నారు. చనాక కొరటా సహా ఎమ్మెల్యేలు కోరిన ప్రాజెక్టులు చేపడుతామని, భూసేకరణకు వారు చొరవ తీసుకోవాలని కోరారు. ఇరిగేషన్ శాఖను పదేళ్లుగా నిర్వీర్యం చేస్తే తాము 700మంది ఏఈలను భర్తీ చేశామని, 1800మంది లస్కర్లను నియమించడం ద్వారా బలోపేతం చేశామని తెలిపారు. మూసీ మూడుకాల్వల ద్వారా రెండేళ్లలో పనులు పూర్తి చేసి 60వేల ఎకరాలను నీరందిస్తామన్నారు. భూసేకరణ త్వరితగతిన జరిగితే ఏడాదిలోనే పూర్తి చేస్తామన్నారు. అయిటిపాముల లిఫ్టును పూర్తి చేయిస్తామని తెలిపారు.
బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డితో స్విచ్ ఆన్ చేయించామని, వైఎస్ హయాంలో మొదలైన ఈ ప్రాజెక్టును బీఆర్ఎస్ పట్టించుకోలేదని, తాము భూసేకరణకు 70కోట్లు విడుదల చేశామని, ప్రధాన కాలువలను పూర్తి చేస్తామని చెప్పారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ రివైజ్ ఎస్టిమేట్ 4,650కోట్లతో కేబినెట్ ఆమోదించిందని, టీబీఎం మిషన్లు అమెరికా నుంచి తెప్పించి రెండేళ్లలో పనులు పూర్తి చేస్తామన్నారు. డిండి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులను నెల రోజుల్లో ఫైనల్ చేస్తామని తెలిపారు. లిఫ్టు ఇరిగేషన్ స్కీమ్ లకు భద్రతకు స్పెషల్ డ్రైవ్ చేపట్టి అదనపు అధికారులను నియమిస్తామని పేర్కొన్నారు.