Minister Ponguleti : వ‌రంగ‌ల్‌ను రెండో రాజ‌ధానిగా అభివృద్ధి చేస్తాం

వ‌రంగ‌ల్‌ను రాష్ట్ర రెండో రాజ‌ధానిగా అభివృద్ధి చేస్తామ‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి అన్నారు.

Update: 2024-11-03 12:23 GMT

దిశ‌,వరంగ‌ల్ బ్యూరో : వ‌రంగ‌ల్‌ను రాష్ట్ర రెండో రాజ‌ధానిగా అభివృద్ధి చేస్తామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ సమాచార, పౌరసంబంధాల శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ పట్టణంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి రెండవ రాజధానిగా అభివృద్ధి చేయడానికి ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే వరంగల్ ప్రాంత వాసులకు ఎయిర్పోర్టు సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఓ ఆర్ ఆర్, ఇన్నర్ రింగ్ రోడ్డు ఏర్పాటు లతో పాటు రాబోయే 30 సంవత్సరాల వరకు నగర ప్రజలకు అవసరమగు మౌలిక వసతులు, అండర్ డ్రైనేజీ తదితర మౌలిక వసతులు కల్పించుటకు ప్రణాళికలను తయారు చేయడం జరిగిందని తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళోజీ నారాయణరావు కళాక్షేత్రాన్ని, పట్టణానికి సంబంధించిన మౌలిక వసతుల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

చారిత్ర‌క వరంగల్ నగర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. ఆదివారం వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని పొంగులేటి ద‌ర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ద‌ర్శ‌నం అనంత‌రం మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కె.ఆర్ నాగరాజు, వరంగల్, హన్మకొండ జిల్లా కలెక్టర్లు సత్య శారద, పి. ప్రావీణ్యలతో కలిసి భద్రకాళి బండ్ సుందరీకరణ , భద్రకాళి చెరువు, బొంది వాగు వరద నివారణ పనులను, భద్రకాళి మాడ వీధుల నిర్మాణ ప‌నుల‌ను పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి విలేక‌రుల‌తో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. ఆలయ మాడ వీధులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్ర‌ణాళిక‌తో, అధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ప‌నుల‌ను ముందుకు తీసుకెళ్తున్న‌ట్లు తెలిపారు.

భ‌ద్ర‌కాళి చెరువులో క‌బ్జాల‌పై త‌ప్ప‌కుండా చ‌ర్య‌లుంటాయ‌ని అన్నారు. చెరువును కాలుష్య ర‌హితంగా మార్చ‌డం జ‌రుగుతుంద‌ని, పూర్తిగా తాగునీటి జలాశయంగా మారుస్తామన్నారు. చెరువు శిఖం భూమిలో అక్ర‌మ నిర్మాణాల‌పై ఇప్ప‌టికే కొంత స్ప‌ష్ట‌మైన స‌మాచారం ఉంద‌ని, మ‌ళ్లీ క్షేత్ర‌స్థాయిలో అధికారుల చేత స‌ర్వే చేయించి అక్ర‌మ నిర్మాణాల‌ను, ఆక్ర‌మ‌ణ‌ల‌ను గుర్తించ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. ఆక్ర‌మ‌ణ‌దారుల‌పై, అక్ర‌మ నిర్మాణాలు చేప‌ట్టిన వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అన్నారు. జలాశయానికి సంబంధించిన వివరాలను అధికారులను అడగగా సరిగా స్పందించకపోవడంతో అధికారుల తీరుపై మంత్రి మండిపడ్డారు. మరోవైపు వరంగల్ నగరంలోని పలు అభివృద్ధి పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. త్వరలోనే నగరంలోని కాళోజీ కళా క్షేత్రాన్ని ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు.

వరద నివారణకు రూ.158 కోట్లు మంజూరు

భద్రకాళి చెరువు బొంది వాగు వరద నివారణకు ప్రభుత్వం రూ.158 కోట్లు మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. బొంది వాగు నాలా, భద్రకాళి నాలా, భద్రకాళి క్యాష్మెంట్ ఏరియా లలో చేపట్టే వరద నివారణకు సంబంధించిన అభివృద్ధి పనుల మ్యాప్ ను మంత్రి పరిశీలించి, వివరాలు అధికారులను అడిగి తెలుసుకుని సమర్థవంతంగా ఆయా పనులు నిర్వహించుటకు మంత్రి తగు సూచనలు చేశారు. ఆలయాన్ని అనుకొని ఉన్న చెరువు ను అభివృద్ధి చేయడానికి పరిశీలించడం జరిగిందని, సుమారు 380 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు పూడిక పేరుకుపోయి, చెరువు లోతు తగ్గి సమాంతరంగా మారడం కారణంగా నీరు నిలువ సామర్థ్యం తగ్గిపోయిందని, వెంటనే చెరువు పూడికతీతకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను అదేశిచడం జరిగిందని తెలిపారు. భద్రకాళి చెరువు కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, సర్వే చేయించి అక్రమ నిర్మాణం తొలగిస్తామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఇంచార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఇరిగేషన్ ఎస్ ఈ వెంకటేశ్వర్లు, కుడా పిఓ అజిత్ రెడ్డి, జిడబ్ల్యుఎంసి ఎస్ ఈ ప్రవీణ్ చంద్ర, ఈఈ లు భీం రావు, సంతోష్ బాబు, సీతారాం, ఇరిగేషన్, కూడా, జిడబ్ల్యూ ఎంసీ, రెవెన్యూ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Similar News