2026 మార్చి కల్లా దేవాదుల పూర్తి చేస్తాం-మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Update: 2024-08-30 14:01 GMT

దిశ, ములుగు ప్రతినిధి: 2026 మార్చి నాటికి దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి, సోనియా గాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శుక్రవారం వచ్చారు. గుట్టల గంగారం వద్ద గల జె చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్ట్ ను మంత్రులు, జిల్లా అధికార యంత్రాంగం కలిసి పరిశీలించారు. దేవాదుల ప్రాజెక్టు పరిధిలో అధికారుల ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దేవాదుల ప్రాజెక్టుపై అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత క్రమంలో దేవాదుల ప్రాజెక్ట్ ఎన్నుకొని పనులు జరిపిస్తుందన్నారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తవడం వల్ల 7 జిల్లాలు వరంగల్, హన్మకొండ, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగామ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి సస్యశ్యామలం అవుతాయన్నారు. తుది దశకు చేరుకున్న ఫెస్-3 పనుల కోసం 2 వేల 947 ఎకరాల భూసేకరణకు గ్రీన్ సిగ్నల్ లభించిందని, మొత్తం మూడు దశల్లో నిర్మాణం పూర్తి చేయాలన్న ప్రణాళికతో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టు ఇప్పటికే భూ సేకరణతో సహా 91% పనులు పూర్తి అయినట్టు తెలిపారు. 


Similar News