నృసింహుని ‘ పూలుపండ్లు ’..

సంక్రాంతి పర్వదినం మంగళవారం రాత్రి 8 గంటలకు శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామి పూలపండ్లు (మహా-వరపూజ) మహోత్సవం చెంచులక్ష్మీ ఆదిలక్ష్మీలతో మల్లూరు గ్రామంలోని రామాలయ ప్రాంగణంలోని విశ్రాంతి మండపం వద్ద అంగరంగ వైభవంగా నిర్వహించారు.

Update: 2025-01-15 06:56 GMT
నృసింహుని ‘ పూలుపండ్లు ’..
  • whatsapp icon

దిశ, మంగపేట : సంక్రాంతి పర్వదినం మంగళవారం రాత్రి 8 గంటలకు శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామి పూలుపండ్లు (మహా-వరపూజ) మహోత్సవం చెంచులక్ష్మీ ఆదిలక్ష్మీలతో మల్లూరు గ్రామంలోని రామాలయ ప్రాంగణంలోని విశ్రాంతి మండపం వద్ద అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ హేమాచల లక్ష్మీనృసింహాస్వామి ఆలయం ఈవో శ్రవణం సత్యనారాయణ దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో సర్వాంగ సుందరంగా అలంకరించిన మండపంలో పూలుపండ్ల కార్యక్రమాలను భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయ ఉపప్రధాన అర్చక బృందం అమరావది మురళీ కృష్ణమాచార్యులు, రామ నర్సింహా చార్యులు, కారంపూడి శ్రీనివాస విరించి చార్యులు, ప్రధాన అర్చకులు కైంకర్యం రాఘవాచార్యులు, ముక్కామల రాజశేఖరశర్మల ఆధ్వర్యంలో నిర్వహించారు. మకర సంక్రమణ ఉత్తరాయణ కాలం మంగళవారం రాత్రి 7 గంటల నుండి 8.30 గంటల సమయంలో శ్రీ హేమాచల లక్ష్మీనృసింహునికి ఆదిలక్ష్మీ, చెంచులక్ష్మీ అమ్మవార్లకు మల్లూరు గ్రామ పెద్దల సమక్షంలో మహా - వరపూజా కార్యక్రమం నిర్వహించారు.

రాత్రి 7.30 గంటలకు శ్రీ శంభులింగేశ్వర స్వామిని ఆలయ అర్చకులు అనిపిద్ది నాగేశ్వరశర్మ ఆధ్వర్యంలో ఊరేగింపుగా విశ్రాంతి మండపానికి చేరుకున్న అనంతరం శ్రీ హేమాచల కొండల పై కొలువై ఉన్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ లక్ష్మీనృసింహాస్వామిని సుందరంగా అలంకరించిన పల్లకీలో గుట్ట నుండి బోయీలు మల్లూరు గ్రామానికి ఊరేగింపుగా తీసుకొచ్చి మహా-వరపూజా మండపంలో ఉంచారు. ప్రతియేటా సంక్రాంతి పర్వదినం రోజున మల్లూరు గ్రామంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఈవో సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్బంగా మల్లూరు గ్రామంలో మినీ జాతర నిర్వహించడంతో మండలంలోని 25 పంచాయతీల నుండే కాక చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి కార్యక్రమాలను వీక్షించారు. పూలుపండ్ల కార్యక్రమానికి మంత్రి సీతక్క కుమారుడు కుంజ సూర్య ముఖ్య అతిథిగా హాజరై స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు పవన్ కుమారాచార్యులు, వెంకట నారాయణ శర్మ, రాజీవ్ శర్మ, ఈశ్వరచంద్ శర్మలు పాల్గొన్నారు.


Similar News