లారీని తగులబెట్టిన యాజమాని.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు..

ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 2వ తేదీన ఉదయం 7 గంటలకు అంకన్న గూడెం ఊరు చివర ఒక పాత లారీ అనుమానాస్పద స్థితిలో అగ్నికి ఆహుతి అయింది.

Update: 2023-03-04 12:55 GMT

దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 2వ తేదీన ఉదయం 7 గంటలకు అంకన్న గూడెం ఊరు చివర ఒక పాత లారీ అనుమానాస్పద స్థితిలో అగ్నికి ఆహుతి అయింది. ఈ సమాచారం తెలుసుకున్న వెంకటాపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లారీ కాలిపోయిన అనంతరం వాహనానికి చెందిన యాజమానిని, డ్రైవర్, క్లీనర్ లను పోలీసులు పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించగా, లారీని 2019లో ఫైనాన్స్ తో కొనుగోలు చేసిన యాజమాని, ఆ తరువాత కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రతినెల పైనాన్స్ సరిగా కట్టలేకపోయాడు.

ఈ క్రమంలో లారీ తగలబెట్టడం వల్ల పూర్తి ఇన్సూరెన్స్ పొందవచ్చునని, వచ్చిన డబ్బులతో ఫైనాన్స్ చెల్లించవచ్చునని యాజమాని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో లారీని తగలబెడితే దానిని మావోయిస్టులే తగులబెట్టారని అందరూ అనుకుంటారనే కారణంతో, ఈ నెల 1వ తేదీ రాత్రి 11 గంటలకు అంకన్నగూడెం సమీపంలో లారీని డీజిల్ పోసి తగులబెట్టి వెళ్లినట్టు యాజమాని పోలీసుల వద్ద నిజం ఒప్పుకున్నాడు. ఈ మేరకు పోలీసులు వారిపై చట్టరీత్యా ఐపీసీ సెక్షన్ 407, 420, 435 కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరచడం జరిగింది. 

Tags:    

Similar News