తీవ్ర ఇబ్బందుల్లో అగ్రవర్ణ పేదలు: రామారావు

Update: 2022-01-23 11:17 GMT

దిశ, కాటారం: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి పట్ల ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు విమర్శలు చేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొందేందుకు అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాల జారీలో జరుగుతున్న జాప్యాన్ని ఆయన నిరసించారు. ప్రభుత్వ తీరు ఇలాగే ఉంటే ఓసీ సామాజిక సమాఖ్య, ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళన కార్యక్రమాలు చేపట్టి, ప్రగతి భవన్‌ను ముట్టడించడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. ఆదివారం కాటారం మండల కేంద్రంలో నిర్వహించిన ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య రాష్ట్ర, జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని రామారావు మాట్లాడుతూ.. హుజురాబాద్ ఉప ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించి ఆదాయ పరిమితి సరళీకృతం చేస్తూ జారీ చేసిన ఆదేశాలు నేటికీ అమలుకు నోచుకోవడంలేదని ఆరోపించారు.

మంత్రివర్గ సమావేశంలో అగ్రవర్ణ పేదలకు రూ.8 లక్షల ఆదాయ పరిమితిని సులభతరం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ అందుకు సంబంధించిన ఉత్తర్వులు క్షేత్రస్థాయి అధికారులకు అందకపోవడం వల్ల తాసీల్దార్ కార్యాలయంలో ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదన్నారు. దీంతో అవకాశం ఉన్నా, అగ్రవర్ణ పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో రాష్ట్రంలో 65 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నందున ఆలోగానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందించే ఏర్పాటు చేయాలని కోరారు. హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చిన మేరకు రెడ్డి, వైశ్య కులాల ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఆయా వర్గాల అభ్యున్నతికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

లేకపోతే సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉధృతంగా ఉద్యమిస్తామన్నారు. ఈ సమావేశంలో ఓసీ సమాఖ్య రాష్ట్ర జిల్లా నాయకులు జనగామ కరుణాకర్ రావు, ఓసీ జేఏసీ మండల శాఖ అధ్యక్షులు ఆనంతుల రమేష్ బాబు, నాయకులు ఉడుముల విజయారెడ్డి, కొప్పుల శ్రీకాంత్ రెడ్డి, సామ బాల చందర్, రవీందర్ రావు, మూల పుల్లారెడ్డి, పవిత్రపు శ్రీనివాస్, నడిపెళ్లి ప్రభాకర్ రావు, రావికంటి అశోక్, కముటాల రవీందర్, మద్ది సూర్యనారాయణ, ఆయించ ప్రవీణ్, లెంకల శ్రీనివాస్ రెడ్డి, చందుపట్ల సుధాకర్ రెడ్డి, లింగంపెల్లి ప్రసాద్ రావు, కామిడి రత్నాకర్ రెడ్డి, దాసరి తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News