ఆదమరిచారో అంతే సంగతులు!

Update: 2024-12-16 14:35 GMT

దిశ, కొత్తగూడ : నిత్యం రాకపోకలతో బిజీగా ఉన్న రహదారికి బుంగపడి పెద్ద గొయ్యి ఏర్పడి నోరు తెరుచుకొని ప్రమాద కూహగా మారి ఉండటంతో ప్రయాణికులు భయాందోళన గురవుతున్నారు. ఇల్లందు నుండి గంగారం, కొత్తగూడ, నర్సంపేట వెళ్లే రహదారిలో దాదాపు మూడు అడుగులు ప్రమాదకరంగా ఏర్పడిన గొయ్యిలో వాహనదారులు బోల్తా పడి ప్రమాదాలు వాటిల్లి ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొంది. ప్రధాన రహదారిలో గొయ్యి ఏర్పడంతో హెచ్చరికలు జారీ చేయాల్సిన అధికారులు కనీసం ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయక పోవడం శోచనీయం. ప్రమాదంగా ఉన్న గొయ్యి వాహనదారులకు దగ్గరికి వచ్చే వరకు కనిపించకుండా ప్రమాదంగా ఉంది. వేగంగా వచ్చిన వాహన దారులు ఆదమరిస్తే కంటి రెప్ప పాటులో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. నిత్యం ప్రయాణికులు నడిచే రహదారిలో గొయ్యి ఏర్పడి రోజులు గడుస్తున్నా ఎవ్వరు కూడా చూసిన పాపాన పోలేదు. ప్రమాదకరంగా ఏర్పడిన గొయ్యిని మరమ్మతులు చేయాల్సిన అధికారులు చూసి చూడకుండా వదిలేయడంతో స్థానికులు ప్రాణాలు పొతేగాని పట్టించుకోరా అంటూ అశ్చర్యానికి గురవుతున్నారు.

అసలే ఏజెన్సీ ప్రాంతం అందులో దట్టమైన అడవి ప్రాంతం. అటుగా వెళ్తున్న ప్రయాణికులు యాదృచికంగా ప్రమాదం వాటిల్లితే అందుబాటులో సాయం చేసే వారుండరు, సరైన వైద్య సౌకర్యం ఉండదు ప్రాణాలు పోవడం తప్ప మరేదారి లేని ఈ ప్రమాదపు గొయ్యిని చూసి చూడకుండా వదిలేయడం చూపారులకు అశ్చర్యానికి గురిచేస్తోంది. ఖమ్మం జిల్లా నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రానికి వెళ్ళసిన వాహన దారులు అతి సమీపం ఉండటంతో ఈ దారినే ఎంచుకుంటారు. రెండు జిల్లాల మధ్య గల ఈ దారి ప్రయాణికుల వాహనాలతో బిజీగా ఉన్న రోడ్డులో వాహనాలు గొయ్యిలో పడటంతో వాహనాలు ధ్వంసం అయ్యి ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఉన్నాయాంటూ ప్రయాణికులు, స్థానికులు వాపోతున్నారు. అత్యవసర సమయంలో 108 అంబులెన్సు కూడా కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మరమ్మత్తులు చేసి ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు.

అధికారులు స్పందించి మరమ్మతులు చేసి ప్రాణాలను కాపాడాలి -

సువర్ణపాక వెంకటరత్నం మహబూబాబాద్ జిల్లా తుడుం దెబ్బ అధ్యక్షులు

కొత్తగూడ నుండి ఇల్లందు వెళ్లే రహదారిలో గొయ్యి పడి ప్రమాదంగా ఉంది. దీని వలన వచ్చి పోయే ప్రయాణికులకు ప్రమాదాలు వాటిల్లుతాయి. గొయ్యి ఏర్పడి చాలా రోజులు అవుతుంది. అధికారులు పట్టించుకోవడం లేదు. ఏజెన్సీ ప్రాంతంలోని రోడ్లన్నీ అద్వనంగా ఉన్నాయి. అటవీ ప్రాంతం మూల మలుపులు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అది కాకుండా ఇటువంటి గొయ్యిల వలన ఇంకా ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అధికారులు స్పందించి గొయ్యికి మరమ్మతులు చేసి ప్రాణాలను కాపాడాలి.


Similar News