మండలం లో 5 కొత్త పంచాయతీలకు ప్రతిపాదనలు
మండలం లో 5 కొత్త పంచాయతీలు ఏర్పడనున్నాయి. ప్రజల స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వీటి ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు తెలిసింది.
దిశ, మంగపేట : మండలం లో 5 కొత్త పంచాయతీలు ఏర్పడనున్నాయి. ప్రజల స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వీటి ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలం లో ఏర్పడే కొత్త పంచాయతీలకు సంబంధించి వాటి నైసర్గిక స్వరూపాలతో కూడిన చిత్రాలను రాష్ట్ర ప్రభుత్వానికి మండల అధికారులు అందజేశారు. మండలంలో ఇప్పటికే 25 పంచాయతీలుండగా కొత్తగా ఏర్పడే 5 పంచాయతీలతో వాటి సంఖ్య 30కి చేరనుంది. మండలంలోని కొత్తూరు మొట్లగూడెం పంచాయతీ నుండి తొండ్యాల లక్ష్మీపురంను కొత్తగా ప్రతిపాదించగా రేగులగూడెంను శివారు గ్రామంగా చేర్చారు.
నర్సింహాసాగర్ పంచాయతీ నుండి నరేందర్ రావుపేటను కొత్త పంచాయతీగా ప్రతిపాదించగా గండిగూడెంను శివారు గ్రామంగా చేర్చారు. నర్సింహాసాగర్, మల్లూరు పంచాయతీల నుంచి శనిగకుంటను కొత్త పంచాయతీగా ప్రతిపాదించగా మల్లూరు పంచాయతీలోని మొట్లగూడెంను శివారు గ్రామంగా చేర్చారు. బుచ్చంపేట పంచాయతీ నుండి జబ్బోనిగూడెంను కొత్త పంచాయతీగా ప్రతిపాదించారు. తిమ్మంపేటలోని అబ్బాయిగూడెంను కొత్త పంచాయతీగా ప్రతిపాదించి బీసీ కాలనీని శివారు గ్రామంగా చేర్చుతూ మొత్తం 5 కొత్త పంచాయతీలను ఏర్పాటు చేయనున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ కొత్త పంచాయతీలను స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే లోపు ప్రకటించనున్నట్లు తెలిసింది.