వేసవిలో తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోండి: కలెక్టర్ శశాంక
వేసవిలో తాగునీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శశాంక మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
దిశ, మహబూబాబాద్ టౌన్: వేసవిలో తాగునీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శశాంక మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయ భవనంలోని కలెక్టర్ చాంబర్ లో సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై సంబంధిత మున్సిపల్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిషన్ భగీరథ పనులు వేగవంతం చేయాలన్నారు. ఏప్రిల్ 15వ తేదీ లోగా నిర్మాణాలను పూర్తి చేసి 20 వ తేదీ వరకు ట్రయల్ రన్ నిర్వహించాలన్నారు. మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని 36వ వార్డులో 9వేల పాత కనెక్షన్లు ఉండగా కొత్తగా మరో 7వేల కనెక్షన్లు ఇవ్వడం జరిగిందన్నారు.
తాగునీరు వృథా కాకుండా స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. వృథాగా పోతున్న తాగునీరు అరికట్టాలని, లీకేజీలు సరిచేయించాలన్నారు. ప్రతి రోజు ప్రజలకు సరఫరా చేయవలసిన 135 ఎల్బీసీడీలను ఖచ్చితంగా ఇవ్వాలన్నారు. పనిచేయని బోర్లు మరమ్మతులు చేయించాలని, తాగునీరు అందని ప్రాంతాలకు ట్యాంకర్లతో నీటి సరఫరా చేయాలన్నారు. వేసవిలో ఎక్కడా తాగునీటి కొరత రాకుండా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో మిషన్ భగీరథ ఈఈ సురేందర్, పబ్లిక్ వర్క్స్ ఈఈ రంజిత్, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, మున్సిపల్ డీఈ. ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.