కబ్జా చేస్తే కఠిన చర్యలుః కలెక్టర్ రాహుల్ శర్మ

Update: 2024-08-30 11:10 GMT

దిశ, కాటారం : మహాదేవపూర్ మండలంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ఒక్క సెంటు భూమి కబ్జా చేసినా సరే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. శుక్రవారం మహాదేవపూర్ మండలంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విస్తృతంగా పర్యటించారు. మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ప్రభుత్వ పాఠశాలల సముదాయాన్ని పరిశీలించారు. అటవీ, రెవెన్యూ, భూముల వివరాల నివేదిక ఇవ్వాలని, అసంపూర్తిగా ఉన్న అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను పూర్తి చేయాలని అన్నారు. మండల కేంద్రంలో నూతన తహసిల్దార్ కార్యాలయ భవన నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, తక్షణమే కాంట్రాక్టర్ ను తొలగించి మరొక కాంట్రాక్టర్ కు నిర్మాణ భాద్యతలు అప్పగించి త్వరగా అందుబాటులోకి తేవాలని పీఆర్ ఇంజినీరింగ్ అధికారు లను ఆదేశించారు. నిరుపయోగంగా ఉన్న మాడా భవన మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తేవాలని సూచించారు. సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని డెంగీ, మలేరియా, టైఫాయిడ్ లాంటి విష జ్వరాల బారిన పడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. డయాలసిస్ విభాగం, క్యాజువాలిటీ, జనరల్ వార్డులను పరిశీలించి రోగులను వైద్య సేవల గురించి ఆరా తీశారు. వ్యాధులు. ప్రబల కుండా తీసుకోవాల్సిన జాగ్రత్తపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతి రాజ్ ఈ ఈ దిలీప్, ఎంపిడిఓ వెంకటేశ్వర రావు, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.


Similar News