స్కూల్లో నిద్రపోతున్న సార్... (వీడియో)
ఆ ఉపాధ్యాయుడు ప్రతిభావంతుడు. అందుకే ఓ పాఠశాల నుండి మరో పాఠశాలకు డిప్యూటేషన్...Special Story of School Teacher
దిశ, కొత్తగూడ: ఆ ఉపాధ్యాయుడు ప్రతిభావంతుడు. అందుకే ఓ పాఠశాల నుండి మరో పాఠశాలకు డిప్యూటేషన్ పై వచ్చారు. తీరా పాఠశాలలో చుస్తే ఇదీ పరిస్థితి. ఈ పంతులు పాఠాలు చెబితే ఫస్ట్ ర్యాంకులు రావాల్సిందే.. పంతులు కుర్చీలో అలా ఒరిగి కూర్చోని ఉన్నాడు.. పిల్లలకు పాఠాలు చెప్పి అలిసి పోయాడని అనుకుంటున్నారా లేదండొయ్. అసలు కారణం వేరే ఉంది. సారు గారు మధ్యాహ్నం పప్పు చారు, పెరుగు అన్నం భూజించాడట ఇంకేముంది అలా నిద్రలోకి జారుకున్నాడు.
పిల్లలు ఎటుపోయినా పర్వాలేదు. పాఠాలు చెప్పాల్సిన పనీ లేదు. అసలు అలాంటి ఇబ్బందేమీ కొంత కాలంగా లేదు. కొత్తగూడ మండలంలోని కార్లాయి ప్రభుత్వ పాఠశాలలో ఈ పరిస్థితి ఏజెన్సీలో విద్యా బోధన పట్ల ఉపాధ్యాయుడికి ఉన్న అంకుటిత పట్టుదలకు సాక్ష్యంగా నిలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే... కొత్తగూడ మండలంలోని కార్లాయి గ్రామం. అక్కడి పాఠశాలకు కొన్ని నెలల కిందట ఓ ఉపాధ్యాయుడు డిప్యూటేషన్ పై వచ్చారు. మిట్ట మధ్యాహ్నం పాఠాలు చెప్పాల్సింది వదిలేసి హాయిగా రాజులా నిద్ర పోతున్నాడు. దిశ ప్రతినిధికి సమాచారం చేరి వెళ్ళేసరికి సైతం పంతులు మంచి నిద్రలో లీనమై ఉన్నాడు. ఏంటి సార్ మిట్ట మధ్యాహ్నం పిల్లల్ని గాలికి వదిలేసి పడుకుంటున్నారని అడిగితే పప్పుచారు, పెరుగు అన్నంతో తిన్నాను అలా నిద్ర వచ్చేసిందని ఈజీగా తన తప్పేమీ లేనట్లు కొంత కాలంగా చేస్తున్న పనిని ఉన్నది ఉన్నట్లు ఆ ఉత్తమ ఉపాధ్యాయుడు బదులిచ్చాడు.
లక్ష్యం నీరుగారుతోంది..!
ప్రభుత్వం నాణ్యమైన విద్యనందించేందుకు కోట్ల రూపాయలు వెచ్చించి విద్యార్థులను తీర్చిదిద్దేందుకు రూ. లక్షల్లో జీతాలిచ్చి ఉచిత విద్యను అందిస్తుంటే ఇలాంటి ఉపాధ్యాయుల వల్ల భష్టు పట్టి పోతుందని పలువురు విమర్శిస్తున్నారు. ఇటీవల ఐటీడీఓ పీఓ అంకిత్ సందర్శించిన సాధిరెడ్డిపల్లి గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రిని గానీ, సంబంధిత మంత్రిని గానీ గుర్తుపట్టలేని పరిస్థితి, పీఓ అంకిత్ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాగా నేటి పరిస్థితి ఏజెన్సీ ఏరియాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరుకు ఇది అద్దం పడుతోంది. రూ. లక్షల్లో జీతాలు తీసుకుంటూనే కనీసం విద్యాబోధన అందించకపోవడం గత కొంత కాలంగా ఇరు ఏజెన్సీ మండలాల్లో చర్చనీయాంశంగా మారింది.
నేను ఎలాంటి చర్యలు తీసుకోలేను: హెచ్ఎం నాగరత్నం
కాంప్లెక్స్ హెచ్ఎం నాగరత్నంను వివరణ కోరగా.. 'కార్లయి పాఠశాల నా పరిధిలో నే ఉంది. కానీ అతను వీరంపేట పాఠశాల నుంచి గత నాలుగు ఏండ్లుగా కార్లయిలో బోధిస్తున్నాడు. కావున నేను ఎలాంటి చర్యలు తీసుకోలేను. వీరంపేట పాఠశాల మాచర్ల కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుల పరిధి కావున వారు చర్యలు తీసుకుంటారు' అని పేర్కొన్నారు.
వింతైన సమాధానం సరికాదు చర్యలు తీసుకుంటాం: విద్య శాఖ మండల అధికారి శ్రీదేవి
కార్లయి పాఠశాలలో బోధిస్తున్న ఉపాధ్యాయులు శ్రీను పాఠశాల సమయంలో నిద్రపోవటం.. మళ్ళీ తాను వింతైనా సమాధానం ఇవ్వడం సరికాదు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.