200 టన్నుల యూరియా పక్కదారి..?

జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు గత నెల 20న అలాట్మెంట్ చేసిన యూరియా పంపిణీలో... Special News

Update: 2023-03-02 10:27 GMT

దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు గత నెల 20న అలాట్మెంట్ చేసిన యూరియా పంపిణీలో అవకతవకలు జరిగాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు 450 మెట్రిక్ టన్నుల యూరియా అలాట్ మెంట్ జరిగింది. కాటారం మండలంలోని దేవరరామ్ పల్లిలోని రాజరాజేశ్వర ఫర్టిలైజర్స్ కు 49.5 టన్నులు, గారేపల్లిలోని క్రాంతికుమార్ ట్రేడర్స్ కు 99 టన్నులు, లావణ్య ఫర్టిలైజర్స్ కు 39.6 టన్నులు, బచ్చు ప్రభాకర్ ఫర్టిలైజర్స్ కు 39.6 టన్నులు, కాళేశ్వరం తిరుమల ఫర్టిలైజర్స్ కు 29.7 టన్నులు, కొయ్యూరులోని జై హనుమాన్ ఫర్టిలైజర్స్ కు 59.4 టన్నులు, బొమ్మపూర్ లోని సాగర్ ఫర్టిలైజర్స్ కు 29.7 టన్నులు, తాటిచెర్లలోని తిరుమల ట్రేడర్స్ 14.850 టన్నులు, జయశంకర్ లో శ్రీలక్ష్మి ట్రేడింగ్ పేరుతో 39.600 టన్నులు, టీఎస్ ఆగ్రోస్ కు 49.5 టన్నులు నాగార్జున కంపెనీ అలాట్మెంట్ చేశారు. క్షేత్రస్థాయిలో కొన్ని దుకాణాలకు యూరియా పూర్తిగా పంపిణీ చేయలేదు. దుకాణాల పేరుతో ఎన్ఓసీలు వ్రాసి, యూరియాను కొన్ని దుకాణాల పేరిట ఇతర జిల్లాలకు కంపెనీ రిప్రెజెంటీటివ్ విక్రయించినట్లు తెలుస్తోంది.

ఎన్ని రోజులుగా ఈ తతంగం జరుగుతుందో తెలియదు గానీ ఈసారి గుట్టు రట్టయింది. గత ఆరు నెలలలో నాగార్జున కంపెనీకి చెందిన యూరియా 220,450 టన్నులు రెండు విడతలుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు యూరియా అలాట్మెంట్ కేటాయించారు. గత నెల 20న జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు కేటాయించిన 450 మెట్రిక్ టన్నులలో సుమారు 200 టన్నుల యూరియా ఇతర జిల్లాలకు దారి మళ్లించినట్లు అర్థమవుతుంది. హోల్ సేల్ గా ఎరువులు విక్రయించేందుకు జిల్లా లైసెన్స్ లేనప్పటికీ బిల్లులు పెట్టినట్లు సమాచారం. ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే దుకాణాల పేరిట అలాట్మెంట్ ఇస్తూ కంపెనీ సేల్స్ ఆఫీసర్ ఈ యూరియాను దారి మళ్లించినట్లు సమాచారం. ఈ విషయమై క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు విచారణ చేసి ఎన్ని టన్నుల యూరియా స్టాక్ వచ్చింది.. మిగతాది ఏం జరిగిందనే విషయమై దుకాణదారుల నుండి దరఖాస్తులను తీసుకుని వెళ్లారు. మహాదేవపూర్, మలహర్ మండలాల్లో వచ్చిన యూరియాను వ్యాపారస్తులు విక్రయిస్తున్నారు. కాటారం మండలంనకు వచ్చిన యూరియాపై వ్యవసాయ అధికారులు దుకాణాల వారీగా తనిఖీలు చేశారు. స్టాకున్నా యూరియాను విక్రయించకుండా నిలుపుదల చేస్తూ నోటీసులు ఇచ్చారు. దుకాణాలకు స్టాక్ రాకుండా పక్కదారి మళ్లిన విషయమై ఎలాంటి చర్యలు తీసుకోకుండా దుకాణాల్లో ఉన్న స్టాకును విక్రయించకుండా వ్యవసాయ అధికారులు తీసుకున్న చర్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Tags:    

Similar News