Putta Madhukar : కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్సోళ్లు కళ్లు తెరువాలే...

భారీ వర్షాలతో మేడిగడ్డ ప్రాజెక్టుకు 10 లక్షల క్యూసెక్కుల

Update: 2024-07-22 13:20 GMT

దిశ, కాటారం : భారీ వర్షాలతో మేడిగడ్డ ప్రాజెక్టుకు 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తున్న తట్టుకున్నదని, రెండు పిల్లర్లు కుంగిపోతే ప్రాజెక్టు పని అయిపోయిందని దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్‌ పాలకులు కళ్లు తెరిచి చూడాలని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ స్పష్టం చేశారు. సోమవారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాదేవ్ పూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ ను ఆయన సందర్శించి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రాజెక్టులోకి భారీగా నీరు వస్తుందని, సుమారు పది లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా అదే స్థాయిలో దిగువకు విడుదల చేసి నీటిని వృధాగా పంపేస్తున్నారని ఆయన అన్నారు. ఈనాడు పది లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని తట్టుకుని నిలబడిన మేడిగడ్డ బ్యారేజ్ చరిత్ర సృష్టి స్టోందన్నారు. అలాంటి బ్యారేజ్ బూచి చూపి మాజీ సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ సర్కార్‌ను బదనాం చేయాలని కాంగ్రెస్‌ పార్టీ కుట్రలు చేసిందన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోతే లక్ష కోట్ల అవినీతి జరిగిందని బదనాం చేశారని, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.83వేల కోట్ల ఖర్చు అయిందన్నారు.

ఇందులో మూడు బరాజ్‌లు, వేల కిలోమీటర్ల పైప్‌లైన్‌లు, టన్నెల్ లు, సబ్‌ స్టేషన్‌లతో పాటు భూసేకరణ కూడా ఉందన్న విషయాన్ని గుర్తించకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజలకు ఈ విషయం తెలియకుండా కేవలం మేడిగడ్డ బరాజ్‌కే లక్ష కోట్లు ఖర్చు చేసినట్లు నమ్మించి ప్రజల ముందు దోషిగా నిలబెట్టే కుట్ర చేశారన్నారు. మేడిగడ్డ బరాజ్‌లో 85గేట్లు 86 పిల్లర్ల నిర్మాణానికి రూ.3600కోట్లు ఖర్చు అయ్యాయని, అందులో రెండు పిల్లర్లకు క్రాక్‌ వస్తే లక్ష కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. ఈనాడు సీఎం రేవంత్‌రెడ్డి మూసీ నదిని ముందుకు తీసుకువచ్చి ఒకసారి రూ.50 వేల కోట్లు అని మంత్రి జూపల్లి కృష్ణారావు రూ.70 వేల కోట్లు అని మరోసారి సీఎం ఏకంగా లక్షా యాభై వేల కోట్లు అంచనా అంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందని, ఆరు మాసాల పాలనలో ఒక నదికి మూడుసార్లు అంచనాను పెంచడం కాంగ్రెస్‌కే దక్కిందన్నారు.

బరాజ్‌ బూచి చూపి లక్షల ఎకరాలను ఎండిబెట్టారని, లక్షలాది మంది రైతులను రోడ్డున పడేశారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో మంథని నియోజకవర్గ ప్రజలకు ప్రయోజనం చేకూరలేదని ఎంతో మంది విమర్శలు చేశారని, కానీ ప్రాజెక్టును ఖాళీ చేసిన తర్వాత భూగర్భ జలాలు అడుగంటి పోయి బోర్లు వేస్తే 800 ఫీట్లకు పడిపోయిన విషయాన్ని గుర్తించి ప్రాజెక్టు గొప్పదనం రైతులకు అర్థం అయిందని అన్నారు. తెలంగాణకు అన్నం పెట్టేది కాళేశ్వరం ప్రాజెక్టు అని ఆనాడు మాజీ సీఎం కేసీఆర్‌ చెప్పారని ఆయన గుర్తు చేశారు. పది లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహంలో ఒక్క పిల్లరు కదలలేదనే విషయాన్ని కాంగ్రెస్‌ నాయకులు కళ్లు తెరిచి చూడాలని ఆయన హితవు పలికారు.

Tags:    

Similar News