కబ్జా చెరలో పుల్లయికుంట.. 30 ఎకరాలకు మిగిలింది 3 ఎకరాలే..
ఖిలా వరంగల్ మండలంలోని ఉర్సు శివారులోని సర్వే నెంబర్ 140

దిశ, ఖిలా వరంగల్ : ఖిలా వరంగల్ మండలంలోని ఉర్సు శివారులోని సర్వే నెంబర్ 140 లోని పుల్లయికుంట 30 ఎకరాల్లో విస్తరించి ఉండేది. ఈ కుంట నీటి పారకంతో ఉర్సు, రంగశాయిపేట శివారు వ్యవసాయ భూముల్లో పంటలు పండించే వారు. కాలం గడిచే కొద్ది వ్యవసాయం తగ్గుముఖం పట్టింది. ఇదే అదునుగా చేసుకొని కబ్జాదారులు కుంటను చెరబట్టారు. దీంతో ప్రస్తుతం కుంట తన ఆనవాళ్లను కోల్పోయి చివరకు మూడెకరాలకు పరిమితమైంది.
ధరణి రెవెన్యూ రికార్డుల ప్రకారం...
ప్రస్తుత పుల్లయికుంట మోకా పరిశీలించగా మూడెకరాల్లో వర్షపు నీటితో నిండి ఉంది. కానీ ధరణి రెవెన్యూ రికార్డులు పరిశీలించగా సర్వే నెంబర్ 140 లో 8.38ఎకరాల ప్రభుత్వ భూమి అని ఉంది. కుంట భూములు కుంట పేరు మీదనే ఉండాలి. కానీ అధికారులు మాత్రం దానిని ప్రభుత్వ భూమిగా మార్చేశారు. ప్రస్తుతం మూడెకరాల్లో నీటితో విస్తరించి ఉండగా వర్షాకాలం వస్తే వర్షపు నీటితో ఈ పుల్లయికుంట నిండి తూము ద్వారా నీరు ఉర్సు చెరువులోకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ తూము ప్రవహించే మార్గంలో ఖమ్మం నేషనల్ హైవే వెళ్తుంది. అయితే అప్పటి రోడ్డు రవాణా అధికారులు తూమును ముసి వేయకుండా రహదారి కింది భాగంలో 18ఫీట్లతో కల్వర్టు ఏర్పాటు చేసి రహదారి నిర్మించారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఈ తూము ద్వారా కుంటలో ఎక్కువైన నీరు కల్వర్టు ద్వారా బయటకు వెళ్తుంటాయి.
తూమును కబ్జా చేసిన వైనం..
30 ఎకరాల కుంటనే మింగేయగా ఇక తూముతో పనేముంది అనుకున్నాడేమో. ఏకంగా తూమునూ మూయించి దర్జాగా ఇల్లు నిర్మాణం చేసేశారు. దానికి తోడు మున్సిపల్ అధికారుల తోడ్పాటుతో ఉర్సు శివారు కుంట స్థలానికి, తిమ్మాపూర్ హవేలి శివారు హౌస్ నంబర్ తీసుకుని అది కూడా గృహ నిర్మాణ హౌస్ నెంబర్ తీసుకుని, 18 ఫీట్ల తూములో ఐదు ఫీట్ల పైపు వేసి మొత్తం తూమును మట్టితో మూయించి ఇంటి నిర్మాణం చేశారు. ప్రస్తుతం ఆ ఇంటిలో కమర్షియల్ బ్రిక్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇంటి పై ఉన్న నెంబర్ మున్సిపల్ రికార్డులో ఎంక్వయిరీ చేయగా అది తిమ్మాపూర్ హవేలి శివారుకు సంబంధించినదిగా రికార్డులో ఉంది.
గతంలో అక్రమ కట్టడం కూల్చివేత..
గత ప్రభుత్వ హయాంలో ఒక నాయకుడు ఓ రాజకీయ పార్టీ ఆఫీస్ పేరు పెట్టుకొని పుల్లయికుంటలో ఇల్లు నిర్మాణం చేశాడు. స్థానికుల ఫిర్యాదు తో మున్సిపల్ అధికారులు ఆ ఇంటిని కూల్చేశారు.
కుంట నిండితే మా పరిస్థితి ఏంటి.. : సాగర్, లెనిన్ నగర్ కాలనీ అధ్యక్షుడు
కుంట పక్కనే దాదాపు 250 గుడిసెల్లో ప్రజలు నివాసం ఉంటున్నారు. వర్షాకాలం వస్తే కుంట నిండుతుందని, ఇలా తూమును కబ్జా చేసి ఇల్లు నిర్మాణం చేస్తే అడ్డుకోవాల్సిన మున్సిపల్ అధికారులే ఇంటికి హౌస్ నెంబర్ ఇచ్చేశారు. తూము మూత పడింది. వర్షాకాలం వస్తే మా కాలనీ మొత్తం వర్షం నీటిలో మునిగిపోతుంది. ఇప్పటికైనా అధికారులు కబ్జా చేసిన ఇంటిని తొలగించి తూమును తెరవాలి.