మానుకోటలో ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్‌కు ఎదురుగాలి

మానుకోట ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్ టికెట్ క‌ట్ కానుందా..? భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు, వ్యక్తిగ‌త వైఖ‌రి, పార్టీలో కొంత‌మంది ప్రజాప్రతినిధులను ప‌క్కన పెట్టడం వంటి చ‌ర్యల‌ను అధిష్ఠానం సీరియ‌స్‌గా తీసుకుందా..?

Update: 2023-05-24 03:05 GMT

దిశ, మహబూబాబాద్ ప్రతినిధి : మానుకోట ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్ టికెట్ క‌ట్ కానుందా..? భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు, వ్యక్తిగ‌త వైఖ‌రి, పార్టీలో కొంత‌మంది ప్రజాప్రతినిధులను ప‌క్కన పెట్టడం వంటి చ‌ర్యల‌ను అధిష్ఠానం సీరియ‌స్‌గా తీసుకుందా..? అంటే అవున‌నే స‌మాధానమే వ‌స్తోంది. మొత్తానికి శంక‌ర్‌నాయ‌క్‌ టికెట్ క‌ట్‌..!? అన్నట్లుగానే పార్టీలోని సీనియ‌ర్ నేత‌ల ద్వారా తెలుస్తోంది. అధినేత కేసీఆర్‌కు అందిన రిపోర్టులో సైతం శంక‌ర్‌నాయ‌క్ ఎక్కువ‌గా మైన‌స్ మార్కులే ప‌డిన‌ట్లుగా తెలుస్తోంది. ప్రముఖంగా భూక‌బ్జా ఆరోప‌ణ‌లు, వ్యక్తిగ‌త వ్యవ‌హార‌శైలితోనే ఆయ‌నకు టికెట్ అవ‌కాశాలు స‌న్నగిల్లుతున్నట్లుగా స‌మాచారం.

ఎంపీ మాలోతు క‌విత‌, మంత్రి స‌త్యవ‌తిరాథోడ్‌, ఎమ్మెల్సీ ర‌వీంద‌ర్‌రావు, మున్సిపల్​ కౌన్సిల‌ర్లతోనూ విబేధాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే శంక‌ర్‌నాయ‌క్‌కు టికెట్ ఇచ్చినా పార్టీ నేత‌ల స‌హ‌కారం ఉండ‌క‌పోవ‌చ్చని అధిష్ఠానం పెద్దలు భావిస్తున్నట్లుగా అభిప్రాయ ప‌డుతున్నారు. అదే స‌మ‌యంలో మంత్రి స‌త్యవ‌తిరాథోడ్‌ను ఈసారి ఖ‌చ్చితంగా ఎమ్మెల్యేగా బ‌రిలోకి దించాల‌ని సీఎం కేసీఆర్ భావిస్తున్న త‌రుణంలో డోర్నక‌ల్‌లో ప‌రిస్థితులు, స‌మీక‌ర‌ణాలు అనుకూలించ‌కుంటే మానుకోట నుంచే ఆమెకు అవ‌కాశాలు క‌ల్పించ‌నున్నట్లు తెలుస్తోంది.

క్యాడ‌ర్‌, జ‌నంలో అసంతృప్తి జ్వాల‌లు..

సిట్టింగ్ ఎమ్మెల్యే బానోత్​ శంక‌ర్‌నాయ‌క్‌పై సొంత పార్టీలోనే ఆగ్రహ జ్వాల‌లు ఎగిసి ప‌డుతున్నాయి. పార్టీలో వ‌ర్గ రాజ‌కీయాల‌ను ఎమ్మెల్యే పెంచిపోషిస్తున్నట్లుగా అస‌మ్మతి నేత‌లు మండిప‌డుతున్నారు. మున్సిపాలిటీలో అధికార పార్టీ కౌన్సిలర్లతో సైతం ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు స‌ఖ్యత లేదు. స్థానిక ఎమ్మెల్సీ తక్కళ్లప‌ల్లి రవీందర్ రావు వర్గీయులంటూ కొంత‌మందిపై వివ‌క్ష చూపుతున్నార‌న్న విమ‌ర్శలున్నాయి. స‌ద‌రు కౌన్సిలర్లు మున్సిపాలిటీ చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. స్థానికంగా జరిగే అంశాలపై, ఎమ్మెల్యే తీరుపై నేరుగా కేసీఆర్ ను కలిసేందుకు ప్రయ‌త్నాలు సాగిస్తున్నట్లు సమాచారం.

ఒంటెద్దు పోక‌డ‌ల‌కు మున్సిపాలిటీలో జ‌రుగుతున్న ప‌రిణామాలే నిద‌ర్శన‌మ‌ని వేలెత్తి చూపుతున్నారు. ఎమ్మెల్సీ రవీందర్ రావు, ఎంపీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్ తో సైతం సయోధ్య లేదు. కొంతమంది తప్పని పరిస్థితుల్లో పార్టీ పట్ల అభిమానంతో ఆయన వెంట ఉంటున్నారే తప్ప మనస్ఫూర్తితో గా ఉండరని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. అదే స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గంలో జ‌ర‌గాల్సినంత అభివృద్ధి జ‌ర‌గ‌లేద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. సంక్షేమ‌మైనా, అభివృద్ధి అయినా ఆయ‌న వ‌ర్గం నేత‌ల‌కే అంటూ అస‌మ్మతి నేత‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భూ క‌బ్జాలు.. వివాదాలు..

ఆది నుంచి వివాదాస్పద ఎమ్మెల్యేగా పేరుగాంచిన శంక‌ర్‌నాయ‌క్‌పై ఇప్పటికీ అదే ముద్ర కొన‌సాగుతోంది. మ‌హ‌బూబాబాద్ తొలి క‌లెక్టర్ ప్రీతిమీనతో వ్యవ‌హ‌రించిన తీరు, ప్రభుత్వ ఉద్యోగులపై తిట్లపురాణం, రెడ్లు, వెలమ కులస్తులపై గ‌తంలో ప‌రుష ప‌ద‌జాలంతో మాట్లాడిన సంభాష‌ణ‌లు, భూముల‌ను లాక్కున్నారంటూ ప‌లుమార్లు బాధితులే ఆందోళ‌న‌ల‌కు దిగ‌డం, అనుచ‌రుల‌తో, బినామీల పేర్లతో ప్రభుత్వ, అసైన్డ్ భూములు క‌బ్జా చేసిన‌ట్లుగా మానుకోట ప్రజానీకం నుంచి ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. అసైన్డ్‌, ప్రభుత్వ, పట్టా భూములైనా ఆయన కన్ను పడితే ఖతమేన‌న్న ప్రచార‌మూ ఉంది. ఏ భూమైనా తాను అనుకున్న సర్వే నెంబర్లు వేసి, రికార్డులను సైతం మార్చి, అధికారులను ప్రలోభాలకు గురి చేస్తూ తన పనిని సులువుగా చేసుకుంటూ వందలాది ఎకరాలు కూడబెట్టినట్లుగా రాజ‌కీయ‌, ప్రజా సంఘాల నుంచి సైతం విమ‌ర్శలున్నాయి.

Tags:    

Similar News