దిశ, పర్వతగిరి : పారా అథెటిక్స్ 400 మీటర్ల పరుగు పందెంలో పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన జీవన్జి దీప్తి ఆడనున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే పారాలంపిక్స్ వరకు వెళ్లడం చాలా గర్వకారణం అని దీప్తి తల్లిదండ్రులు ధనలక్ష్మీ-యాదగిరి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా బంగారు పతకం సాధిస్తుందని దేశ పతాకం తన భూజాలపై చూస్తామని ధీమా వ్యక్తంచేశారు. గతంలో దీప్తి జిల్లా స్థాయి నుండి ప్రపంచ స్థాయి వరకు ఏ పోటీల్లో పాల్గొన్న మొదటి స్థానం సాధించేదని అన్నారు. మారుమూల గ్రామంలో పుట్టిన దీప్తి పంద్రాగస్టు రోజున నాలుగో తరగతి చదువుతున్నప్పుడు ఆర్డిఎఫ్ పాఠశాలలో ఆటల పోటీల సందర్భంగా పరుగు పందెంలో మొదట రావటం గుర్తించిన క్రీడా ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడంతో ప్రత్యేక శిక్షణను ఇప్పించారు. అప్పటినుండి అంచలంచెలుగా జిల్లా స్థాయి రాష్ట్రస్థాయి దేశస్థాయిలో ఎన్నో పథకాలు సాధించారు.ప్రపంచ స్థాయిలో వివిధ దేశాలతో పోటీపడి బంగారు సిల్వర్ బ్రౌన్ మెడల్స్ సాధించారు.
మన దేశం నుండి మొదటి ఆథ్లెటిక్ దీప్తి..
ప్రస్తుతం ప్యారిస్ లో జరుగుతున్న పారాలంపిక్స్ లో నేడు, రేపు ఇండియా తరపున పోటీ పడుతోంది దీప్తి. ఇంటలెక్చువల్ ఇంపెయిర్మెంట్ విభాగంలో భారత్ నుంచి పోటీపడుతున్న మొదటి అమ్మాయిగా దీప్తి జీవంజి నిలిచారు. పారా ఒలంపిక్స్ అథ్లెటిక్స్ విభాగంలో 400 మీటర్ల పరుగు పందెంలో దీప్తి ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తోంది. అయితే దీప్తి గత ట్రాక్ రికార్డు నేపథ్యంలో ఖచ్చితంగా మన దేశానికి బంగారు పతకం సాధిస్తుందని విశ్లేషకులు అమ్మాయి తల్లిదండ్రులు మరియు కోచ్ ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూరి రమేష్ అభిప్రాయపడుతున్నారు.