సర్వే స్పీడప్.. శరవేగంగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక శరవేగంగా కొనసాగుతున్నది.
దిశ, నర్సంపేట/ దుగ్గొండి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక శరవేగంగా కొనసాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని వారికి రూ.5 లక్షల వ్యయంతో నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నర్సంపేట నియోజకవర్గం వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం లబ్ధిదారుల ఎంపిక సర్వే వేగం పుంజుకుంది. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూం ఇండ్లు నిరుపేదలకు అందలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల కోసం మొదటగా స్థలం ఉండి రేషన్ కార్డు ఉన్న నిరుపేద లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా 3500 ఇండ్ల నిర్మాణం చేయాలని ప్రణాళిక చేస్తున్నట్లు తెలుస్తోంది.
డివిజన్ వ్యాప్తంగా ఇదీ సంగతి...
నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఆరు మండలాలు, మున్సిపాలిటీతో కలిపి ప్రజాపాలనలో 85,240 దరఖాస్తులు ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చాయి. ఇందులో నేటి వరకు ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా 36,683 కుటుంబాలను సర్వే చేశారు. అయితే 31,959 కుటుంబ వివరాలను మాత్రమే నమోదు చేశారు. సాంకేతిక కారణాలతో 4,724 కుటుంబ వివరాలు పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. ఇంకా డివిజన్ వ్యాప్తంగా 48,557 ఇండ్లకు సంబంధించి సర్వే చేయాల్సి ఉంది.
నర్సంపేట మండలంలో 27 గ్రామ పంచాయతీ పరిధిలో 12,971 మంది నిరుపేదలు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మొదటి దశలో స్థలం ఉండి రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులు ఎంపికను 31 బృందాలతో ఇందిరమ్మ కమిటీల సహకారంతో అధికారులు సర్వే చేస్తున్నారు. ఈ నెల 30 వరకు చివరి తేదీ ఉండడంతో లబ్ధిదారులను త్వరగా ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. జియో ట్యాగ్ ద్వారా లబ్ధిదారుల నిర్మాణ స్థలాలను గుర్తించడం జరుగుతుందని, ఎంపికైన లబ్ధిదారుల వివరాలను ఇన్చార్జ్ మంత్రికి పంపించనున్నట్లు ఎంపీడీవో శ్రీనివాసరావు తెలిపారు. సర్వర్ బిజీ సమస్య కొంత మేరకు సతాయిస్తున్నప్పటికీ లాగిన్ల సంఖ్య పెంచి త్వరితగతిన ఈ నెల 31లోగా పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మండల వ్యాప్తంగా మొత్తం 12,971 మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోగా 4,445 మంది ఇండ్లను సర్వే చేసినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. 5 జీపీలకు అదనంగా లాగిన్లను గురువారం పెంచినట్లు ఎంపీడీఓ శ్రీనివాసరావు తెలిపారు. నర్సంపేట మున్సిపాలిటీలో దరఖాస్తుదారుల సంఖ్య 8,296 కాగా వీరిలో 3,585 ఇండ్ల సర్వే పూర్తి చేశారు. జీవో నెంబర్ 7 లో పేర్కొన్న విధంగా నిబంధనలు పాటిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. వితంతువులు, అంగవైకల్యం ఉన్నవారికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.
దుగ్గొండి మండలం..
ప్రజాపాలనలో ఇంటి నిర్మాణం కోసం మండలంలో 34 గ్రామ పంచాయతీల్లో 13,028 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో భాగంగా నేటి వరకు 6,147 దరఖాస్తులను సర్వే చేశారు. ఇంకా 6,881 దరఖాస్తులు సర్వే చేయాల్సి ఉంది. 728 కుటుంబాల వివరాలు సాంకేతిక కారణాలతో పెండింగ్ లో ఉన్నాయి.
నెక్కొండ మండలం..
మండలంలో మొత్తం 39 గ్రామ పంచాయతీలలో 16,410 దరఖాస్తులు వచ్చాయి. లబ్ధిదారుల సర్వేలో నేటి వరకు 7,558 ఇండ్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
నల్లబెల్లి మండలం...
నల్లబెల్లి మండలంలోని 29 పంచాయతీల్లో మొత్తం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 11,870 ఉండగా, నేటి వరకు 5,463 దరఖాస్తుల సర్వే పూర్తి చేశారు.
చెన్నారావుపేట మండలం..
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం మండలంలోని గ్రామ పంచాయతీల్లో 12,042 మంది దరఖాస్తు చేసుకున్నారు. సర్వేలో భాగంగా నేటి వరకు 4,163 దరఖాస్తులు పూర్తి చేశారు.
ఖానాపురం మండలం..
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం మండలంలోని 21 జీపీల్లో 10,623 మంది దరఖాస్తు చేసుకున్నారు. నేటి వరకు సర్వేలో భాగంగా 5297 మంది దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పూర్తి చేశారు.