షెడ్డులో మూలుగుతున్న బండ్లు.. పట్టించుకోని అధికారులు

గ్రేటర్‌ వరంగల్‌ బల్దియా అధికారుల బద్దకానికి షెడ్డుకు చేరిన పలు వాహనాలే నిదర్శనం.

Update: 2023-08-30 13:27 GMT

దిశ, వరంగల్‌ టౌన్‌: గ్రేటర్‌ వరంగల్‌ బల్దియా అధికారుల బద్దకానికి షెడ్డుకు చేరిన పలు వాహనాలే నిదర్శనం. మూడు నెలలైనా వాటి మరమ్మతులు పట్టించుకునే వారే కరువయ్యారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ ఆదేశాలను సైతం బేఖాతర్‌ చేయడం విస్మయం కలిగిస్తోంది. బల్దియాలో రూ.40 కోట్లు వెచ్చించి వివిధ రకాల 310 వాహనాలను కొనుగోలు చేశారు. అయితే, వీటిలో కొన్ని వాహనాలు మొరాయించాయి. ఆరు జేసీబీలు, ఒక ఇటాచీ, 25 స్వచ్ఛ ఆటోలు, రెండు రోబోలు, 4 కాంప్యాక్టర్లు, ఒక డోజర్‌, ఒక టిప్పర్లు, 5 ట్రాక్టర్లు రీపేర్‌కొచ్చాయి.

ప్రస్తుతం అవి హన్మకొండలోని బల్దియా రిపేర్ షెడ్డులో మూలుగుతున్నాయి. మూడు నెలలుగా మరమ్మతులకు నోచుకోక అధికారుల తీరును వెక్కిరిస్తున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో 45 వాహనాలు షెడ్డుకే పరిమితమైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఎలక్ట్రికల్‌, వాహనాలు, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సంబంధించి డీఈ కం ఈఈ పర్యవేక్షించాల్సి ఉన్నట్లు సమాచారం. అయితే, సదరు అధికారి పర్యవేక్షణ లోపంతోనే ఈ వాహనాలు మరమ్మతులకు నోచుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


ఇటీవల కురిసిన వర్షాలకు పోటెత్తిన వరద సహాయక చర్యల్లో ఉపయోగించిన పలు వాహనాల్లో కొన్ని రిపేరుకొచ్చాయి. ఈ సందర్భంలో కమిషనర్‌ షేక్‌ రిజ్వాన్‌ భాషా పరిశీలించి, వాటి మరమ్మతులకు సంబంధించి, ఈ ` ఆఫీస్ లో అనుమతులు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. అయినా సదరు అధికారి మాత్రం కమిషనర్‌ ఉత్తర్వులను సైతం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడనే చర్చ జరుగుతోంది. ఫలితంగా ప్రజాధనం దుర్వినియోగం కావడమే కాకుండా పనుల్లో జాప్యం చోటుచేసుకుంటున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి.

డ్రైవర్లకు శాపం..

రిపేర్ కు వచ్చిన వాహనాల మరమ్మతుల విషయం పక్కన పెడితే.. వాటి శాపం ఇప్పుడు ఆయా వాహనాల డ్రైవర్ల మీద పడుతున్నట్లు పలువురు వాపోతున్నారు. వాహనాలు రిపేరు కాకపోవడంతో సదరు డ్రైవర్లకు శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్లు గైర్హాజర్‌ వేస్తున్నట్లు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి సమాచారం లేకుండానే.. డ్రైవర్ల ఐడీ నంబర్లను బ్లాక్‌ చేస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. సమయానికి అనుకూలంగా మరమ్మతులు చేయకుండా సదరు అధికారి నిర్లక్ష్యానికి తాము బలికావలసి వస్తున్నదని మదనపడుతున్నారు. ఇప్పటికైనా కమిషనర్‌ స్పందించి, సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని వాహనాలు త్వరితగతిన రిపేరు చేయించి, తమకు న్యాయం చేయాలని డ్రైవర్లు కోరుతున్నారు.


Similar News