గ్రామసభలు జవాబు దారీతనంగా నిర్వహించాలి
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేసేందుకుగాను నిర్వహించే గ్రామ సభలు జవాబుదారీతనంగా ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య అధికారులను ఆదేశించారు.
దిశ, హనుమకొండ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేసేందుకుగాను నిర్వహించే గ్రామ సభలు జవాబుదారీతనంగా ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య అధికారులను ఆదేశించారు. గురువారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో మండల్ స్థాయి ఆఫీసర్స్ ( పంచాయతీ సెక్రటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్స్, టెక్నికల్ అసిస్టెంట్లతో నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఈనెల 21 నుంచి 25 వరకు నిర్వహించే గ్రామసభలు ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై నిర్దేశించిన భూములను, మైనింగ్ భూముల వివరాలు ఖచ్చితంగా సేకరించాలన్నారు.
అదే విధంగా ప్రభుత్వం కొనుగోలు చేసిన భూముల వివరాలు సూచించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి సేకరించిన వివరాలను గ్రామపంచాయతీ నోటీసు బోర్డుపై వివరాలు ఉంచి అభ్యంతరాలను స్వీకరించాలని, సేకరించిన వివరాలను మండల స్థాయి అధికారులకు తెలియజేయాలన్నారు. లేఅవుట్ మినహా, పడావున్న భూములను కూడా రైతు భరోసా పథకానికి అర్హులుగా గుర్తించాలని కలెక్టర్ తెలిపారు. అదే విధంగా ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఆదాయ వివరాలను సేకరించి అర్హులైన రేషన్ కార్డుల జాబితాలు గ్రామ సభలో ప్రజలకు నివేదించాలని కలెక్టర్ కోరారు.
గ్రామ సభలకు ముందే ఒకరోజు ప్రజల నుంచి అభ్యంతరాలను సేకరించి, ఉన్నతాధికారుల సలహా మేరకు తుది జాబితాను తయారుచేసి గ్రామ సభలలో ప్రదర్శించాలని కోరారు. గ్రామసభలలో స్థానిక లబ్ధిదారులతోపాటు గ్రామస్థాయి ఇందిరమ్మ కమిటీలను కూడా ఆహ్వానించాలని సూచించారు. పెండింగ్ సర్వేలు ఉన్న యెడల రేపటి లోగా పూర్తి చేయాలని, సేకరించిన డేటాను పూర్తిస్థాయిలో భద్రంగా ఉంచి కంప్యూటరైజ్ చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ కె.నారాయణ, తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఏఓ శ్రీనివాస్, ఎంపీఓ విమల, గ్రామపంచాయతీ కార్యదర్శులు, స్పెషల్ అధికారులు, ఏఈఓలు, ఏఈఓలు, ఆర్ ఐ లు పాల్గొన్నారు.