కొమ్మాల జాతరకు పోటెత్తిన ప్రభబండ్లు.. 10 కి.మీ ట్రాఫిక్ జాం
పరకాల నియోజకవర్గం గీసుగొండ మండలంలోని కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి జాతరకు భక్తులు పోటెత్తారు.
దిశ, వరంగల్ బ్యూరో : పరకాల నియోజకవర్గం గీసుగొండ మండలంలోని కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి జాతరకు భక్తులు పోటెత్తారు. లక్షలాదిగా భక్తులు తరలివస్తుండటం.. రాజకీయ పార్టీల ప్రభల సంఖ్య కూడా గతంలో కన్నా భారీగా పెరగడంతో నర్సంపేట-వరంగల్ రహదారిలో భారీగా ట్రాఫిక్ జాం అయింది.
నర్సంపేట మార్గంలోని వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని గిర్నిబావి వద్ద నుంచి ఇటు వరంగల్ లేబర్ కాలనీ నుంచి ట్రాఫిక్ జాం కొనసాగుతుండటం గమనార్హం. ఉదయం 9:30 గంటల నుంచి రోడ్లపై వాహనాల సంఖ్య పెరగడంతో జాతరకు నలువైపులా ట్రాఫిక్ జాం కొనసాగుతోంది. ముఖ్యంగా వరంగల్-నర్సంపేట ప్రధాన రహదారిపై వాహనదారులు అవస్థల పాలవుతున్నారు. నర్సంపేట రహదారిలో పది కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు నిలిచిపోయాయి.
ర్యాలీల నిర్వహణకు రాజకీయ పార్టీల ప్రభలకు పోలీసులు అనుమతులివ్వగా బీఆర్ ఎస్, కాంగ్రెస్, సీపీఐ(ఎంల్), బీజేపీ పార్టీలకు చెందిన ప్రభలతో ఆయా పార్టీల ముఖ్య నేతలు తరలివచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రభవాహనాన్ని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు.
అలాగే నర్సంపేట నుంచి బీఆర్ఎస్ ప్రభబండ్లను మాజీ ఎమ్మెల్యే పెద్దిసుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. రాజకీయ ఉనికిని, దర్పాన్ని ప్రదర్శించేందుకు ప్రభబండ్లను ప్రతీ గ్రామం నుంచి ఆయా పార్టీల నేతలు తరలిస్తుండటం గమనార్హం. ప్రభబండ్లను అడ్డుకోవడంతో కొమ్మాల జాతరకు సమీపంలోని జాతర రోడ్డు వద్ద పోలీసులకు- రాజకీయ పార్టీల నేతలకు మధ్య తోపులాట జరిగి కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.