నాణ్యత నిల్.. అవినీతి ఫుల్..!

గతంలో వర్షాలు కురిస్తే పల్లెల్లోని వీధులలో కాలి నడక నడవలేని దుస్థితి దర్శనమిచ్చేది.

Update: 2023-05-25 02:32 GMT

దిశ, కొత్తగూడ : గతంలో వర్షాలు కురిస్తే పల్లెల్లోని వీధులలో కాలి నడక నడవలేని దుస్థితి దర్శనమిచ్చేది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లె ప్రాంతాలను అభివృద్ధి చేయటానికి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం ప్రధాన ఎజెండాగా తీసుకొని ప్రతి వంద మీటర్ల పొడవు రోడ్డు నిర్మాణానికి రూ.ఐదు లక్షల చొప్పున ప్రత్యేక నిధులు సమకూరుస్తున్నారు. అయితే కాంట్రాక్టర్లు సంబంధిత పంచాయతీరాజ్ అధికారులతో కుమ్మకై సీసీ రోడ్ల నిర్మాణలో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని కొత్తగూడ, గంగారం మండలాల్లో సీసీ రోడ్లు నిర్మించి నెల రోజులు గడవక ముందే పగుళ్ళు ఏర్పడి భారీగా బీటలు పడ్డాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులకు నేరుగా కలిసి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ సంగతి..

కొత్తగూడ మండల కేంద్రంలోని గిరిజన బాలుర స్పోర్ట్స్ స్కూల్ వరకు 500 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.25 లక్షలు, ప్రధాన కూడలి నుంచి పాత ఇండియన్ బ్యాంక్ వీధిలో రూ.5 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. సీసీ రోడ్డు నెలరోజులు గడవకముందే కంకర తేలి, బీటలు వారిన దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. సదరు గుత్తేదార్లు సీసీ రోడ్ల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో ఈ దుస్థితి నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ రోడ్డు పనుల్లో వాడే కంకర కాకుండా సరైన సైజులో లేక పోవటం, పిండిగా ఉండే కంకర (చిప్స్ )వాడినట్లు స్థానికులు ధ్వజమెత్తారు. రోడ్డు నిర్మాణం చేపట్టే క్రమంలో సరైన పద్ధతిలో వైబ్రటింగ్, వాటర్‌ క్యూరింగ్‌ చేయకపోవడమే ప్రధాన కారణమని చర్చ జరుగుతున్నది.

గుత్తేదార్లు ఆడిందే ఆట పాడిందే పాట..

ఉమ్మడి కొత్తగూడ మండలంలో రోడ్డు పనులు జరిగే సమయంలో పంచాయతీరాజ్ అధికారి కనీసం అక్కడ వర్క్ ఇన్ స్పెక్టర్ కూడా సరిగా ఉండటం లేదు. ఈ క్రమంలో గుత్తేదార్లు ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా మారింది. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి, క్వాలీటి కంట్రోల్ అధికారులతో కలిసి సీసీ రోడ్లను ప్రత్యక్షంగా పరిశీలించి సదరు అవినీతి గుత్తేదార్ల పై చర్యలు తీదుకోవాలని స్థానికులు, ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోండి.. అలూరి రాజు, తుడుందెబ్బ మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి

కొత్తగూడ, గంగారం మండలాల్లో సీసీ రహదారుల నిర్మాణాల్లో గుత్తేదారు నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. సీసీ రోడ్లు నిర్మంచి పదిహేను రోజులు కూడా గడవకముందే బీటలు వారుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి.

కానరాని అధికారుల పర్యవేక్షణ.. ఇడంపాక శ్రీశైలం, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ యూ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి

రెండు మండలాల్లో లక్షలాది రూపాయల ప్రభుత్వ నిధులతో జరుగుతున్న రోడ్డు పనులు నాసిరకంగా చేపట్టారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. నాసిరకం మెటీరియల్‌ వాడకం వల్ల నిర్మించిన రోడ్డు నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారాయి.

నాసిరకం పనులు చేస్తున్నరు.. కొట్టె శ్రీనివాస్, బీజేవైఎం మండల అధ్యక్షుడు

పనుల్లో నాణ్యత పాటించడం లేదు. నాసిరకం పనులు చేస్తున్నారు. ఇప్పుడు వేస్తున్న రోడ్ల కంటే పాత రోడ్లు బాగున్నాయి. సిమెంట్ కు బదులు డస్ట్ ఎక్కువగా వాడుతున్నరు. నాసిరకం పనులతో కొత్తగూడ, గంగారం మండలాల్లో నెల గడవకముందే సీసీ రోడ్లు ధ్వంసం అవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ ఉండట్లేదు. క్యూరింగ్ ఉండడం లేదు.

రోడ్డు నీళ్లపాలు.. డబ్బులు కాంట్రాక్టర్ పాలు.. బోడ నవీన్ నాయక్, బీజేపీ గిరిజన మోర్చా వన బంధు రాష్ట్ర కన్వీనర్

ఏజెన్సీ ఉమ్మడి మండలంలో ఇష్టం వచ్చినట్లు కంకర ఇసుక సిమెంటు కలుపుతూ సీసీ రోడ్లు వేస్తున్నరు. నాసిరకం మెటిరియల్ తో రోడ్డు వేయడంతో వేసిన నెలలోపే రోడ్లు పగుళ్లతో దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వ నిధులు కాంట్రాక్టర్ల పాలవుతున్నాయి. అధికారులు కూడా నిర్మాణ పనులను పర్యవేక్షించకపోవడంతో కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలి.

Tags:    

Similar News