విచ్చలవిడిగా బెల్టుషాపులు.. అర్ధరాత్రి దాకా అమ్మకాలు

Update: 2024-08-29 07:11 GMT

దిశ, కేసముద్రం : కేసముద్రం మండలంలో బెల్టు దుకాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా ఏరులైపారుతున్నాయని తెలిసినా... అటువైపు కన్నెత్తి కూడా చూడకుండా ఎక్సైజ్ అధికారులు వ్యవహరిస్తున్నారని.. ప్రజల ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఈ దందా ప్రస్తుతం గల్లీకొకటి ఏర్పాటు కావడంతో మద్యం ప్రియులు ఉదయం టీ,కాఫీలకు బదులుగా మద్యంను తాగుతూ ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ గాయాలపాలవుతున్నారు. వైన్ షాప్ లలో డబ్బులు వుంటేనే, 10 గంటల తరువాత నే విక్రయిస్తారు, కానీ బెల్ట్ షాప్ లలో 24 గంటలు అందుబాటులో వుంటూ రాష్ట్రాన్ని తాగుబోతుల రాజ్యంగా మారుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా గ్రామాల్లో బెల్టుదుకాణాలు కొనసాగుతున్నా.. చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోందన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

లిక్కర్ డాన్లు కమీషన్లకు బెల్టు షాపుల వారికి మద్యం సరఫరా చేస్తున్నారు. రోజుకు ఎంత అమ్మితే అంత కమీషన్లు అందిస్తుండడంతో బెల్టుషాపుల నిర్వాహకులు ఒకరిని చూసి మరొకరు ఈ దందాను జీవనోపాధిగా చేసుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ దందాను బహిరంగంగా కొనసాగిస్తూ ప్రజలను మత్తులో ముంచుతున్నారు. ఆ మద్యం తాగిన వ్యక్తులు వాటికి బానిసలై తమ ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారు. మండల వ్యాప్తంగా సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు బెల్టుషాపులు నిర్వహిస్తున్నారని తెలుస్తుంది. అందులో బాటిళ్లను ఎంఆర్పీ కంటే రూ.50 నుంచి రూ.100 లు ఎక్కువకు విక్రయిస్తు మద్యం ప్రియుల జేబులకు కన్నం పెడుతున్నారు. కొందరు సిబ్బందికి ప్రత్యేకంగా వారం, నెలకు చొప్పున ముడుపులు అందుతుండడంతో ఏదైనా ఫిర్యాదురాగానే బెల్టు షాపుల నిర్వాహకులకు సమాచారం అందించి తనిఖీల విషయాలను చేరవేస్తున్నారు. దీంతో అప్రమత్తం అవుతున్న బెల్టు షాపుల వారు తనిఖీలలో ఏమీ దొరకకుండా జాగ్రత్త పడుతున్నారనే వాదనలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టిసారిస్తేనే ఈ బెల్టుదందాకు అడ్డుకట్ట పడడమే కాకుండా ప్రజల ఆరోగ్యాలకు రక్షణ కల్పించిన వారవుతారనీ, ప్రజల జేబులకు పడిన చిల్లులు ఆగుతాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


Similar News