చిన్న కాళేశ్వరం నీటి పథకంలో ముందడుగు

చిన్న కాళేశ్వరం పంప్ హౌస్ హెడ్ రెగ్యులేటర్ నిర్మాణ పనులను మార్చి వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

Update: 2024-12-20 10:43 GMT

దిశ, కాటారం : చిన్న కాళేశ్వరం పంప్ హౌస్ హెడ్ రెగ్యులేటర్ నిర్మాణ పనులను మార్చి వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మహదేవ్ పూర్ మండలం బీరసాగర్ వద్ద చిన్న కాళేశ్వరం వద్ద గోదావరి నుండి నీటిని తరలించడానికి 250 మీటర్లు వరకు తరలించడానికి చేపట్టిన పంప్ హౌస్ హెడ్ రెగ్యులేటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ… మార్చి డ్రై రన్ లక్ష్యంగా పనులల్లో వేగం పెంచాలని మెగా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

నిర్దేశించిన సమయానికి పథకం పనులు పూర్తి చేసి సాగుకు నీటిని విడుదల చేస్తే తద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. హెడ్ రెగ్యులేటర్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని, అలాగే పంప్ హౌస్ లో విద్యుత్ సంబంధిత పనులను రానున్న మార్చి మాసం నాటికి పూర్తి చేసి డ్రై రన్ నిర్వహణకు సిద్ధం చేయాలని ఆదేశించారు. మోటర్లు, పంప్ హౌస్ మరమ్మత్తు పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ పనుల్లో నాణ్యత పాటించాలని స్పష్టం చేశారు. జాప్యానికి తావులేకుండా నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలని, పనులు ప్రగతిపై ఎప్పటి కప్పుడు నివేదికలు అందచేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.

ఆరోగ్య కేంద్రం, హాస్టల్లో తనిఖీలు

కాళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి సిబ్బందితో మాట్లాడారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓ పి రిజిస్టర్, ఇన్ పేషెంట్ వార్డు, డ్రగ్ స్టోర్ లను పరిశీలించారు. భవనం పై కప్పు లీకేజ్ అవుతోందని సిబ్బంది వివరించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, సిబ్బంది సమయ పాలన పాటిస్తూ నిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మహాదేవపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఆశ్రమ పాఠశాలలోని వంటగది, స్టోర్ రూమ్, డైనింగ్ రూమ్ లను తనిఖీ చేశారు. నూతన డైట్ మెనూ పరిశీలించి మెనూ ప్రకారం అల్పాహారం, భోజనం అందిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయంక్ సింగ్, ఇరిగేషన్ ఈఈ యాదగిరి, తహసీల్దార్ కృష్ణ, డీఈలు సూర్యప్రకాశ్, ఉపేందర్, మెగా డిజిఎం వైవీ రావు పాల్గొన్నారు.


Similar News