Warangal: హన్మకొండ నయీంనగర్ బ్రిడ్జి వద్ద హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

హన్మకొండ నయీంనగర్ బ్రిడ్జి వద్ద హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.

Update: 2024-09-30 08:41 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హన్మకొండ నయీంనగర్ బ్రిడ్జి వద్ద హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. ముందస్తు జాగ్రత్తగా పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజేసిన చిచ్చుతో నయీంనగర్ బ్రిడ్జి వివాదం రోజురోజుకు ముదురుతోంది. దీనిపై బహిరంగ చర్చకు రావాలని పిలుపునిచ్చిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ ఆదివారం బ్రిడ్జి వద్దకు వచ్చి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇవ్వాళ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు బ్రిడ్జి వద్దకు చేరుకొని ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మాజీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఈ వివాదంలో పోలీసులు కలగజేసుకొని ఇరు పక్షాలను విడదీశారు. అనంతరం బీఆర్ఎస్ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై వినయ్ భాస్కర్ నిరసన తెలుపుతూ.. రహదారిపై బైఠాయించారు. అనంతరం పోలీసులు మాజీ ఎమ్మెల్యే దాస్యంను సైతం అరెస్ట్ చేసి ఆ ప్రాంతం నుంచి తరలించారు. కాగా ఇటీవల కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నయీంనగర్ బ్రిడ్జి ప్రస్తావన తెచ్చారు. బ్రిడ్జి మనం కడితే ఇప్పుడున్న ఎమ్మెల్యే పూలాభిషేకాలు చేయించుకుంటున్నాడని ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. కేటీఆర్ వ్యాఖ్యలకు స్పందించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ కేటీఆర్ నిజమైన పొలిటీషియన్ అయితే ఆదివారం నయాంనగర్ బ్రిడ్జి వద్దకు బహిరంగ చర్చకు రావాలని, తాను ఆధారాలతో సహా వస్తానని సవాల్ విసిరారు. 


Similar News