ముందు హైడ్రా ఆఫీస్‌ను కూల్చండి.. కేటీఆర్ సంచలన డిమాండ్

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు.

Update: 2024-09-30 10:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) విమర్శలు చేశారు. సోమవారం కేటీఆర్ తెలంగాణ భవన్‌(Telangana Bhavan)లో మీడియాతో మాట్లాడారు. నెలలు గడుస్తున్నా ఇచ్చిన ఆరు గ్యారంటీల ఊసేలేదని అన్నారు. గతంలో 60 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ నేతలకు చెరువులకు హద్దులు గుర్తించాలన్న సోయి ఎందుకు రాలేదని మండిపడ్డారు. ఎఫ్‌టీఎల్‌(FTL) నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అడిగారు. అసలు ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రాధాన్యతలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. కేవలం మూసీపైనే రూ.1.50 లక్షల కోట్లు కేటాయిస్తారా? అని సీరియస్ అయ్యారు. 2400 కిలోమీటర్లు ఉన్న గంగా నది కోసం కేవలం రూ.40 వేల కోట్లు కేటాయించారని గుర్తుచేశారు.

హైడ్రా కార్యాలయం(Hydraa office) కూడా ఎఫ్‌టీఎల్‌లోనే ఉందని.. కూల్చాల్సి వస్తే ముందుగా ఆ కార్యాలయాన్నే కూల్చాలని కీలక డిమాండ్ లేవనెత్తారు. అంతేకాదు.. ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన బుద్ధభవన్‌ను కూడా కూల్చాలని అన్నారు. ఇవే కాదు.. జీహెచ్‌ఎంసీ(GHMC) ప్రధాన కార్యాలయం, రాష్ట్ర సచివాలయం(Secretariat) కూడా ఎఫ్‌టీఎల్‌లో పరిధిలోనే ఉన్నాయని అన్నారు. అసలు మూసీ సుందరీకరణతో రాష్ట్రానికి ఎంత ఆదాయం తిరిగి వస్తుందని అడిగారు. ఎవరి కమీషన్ల కోసం మూసీ సుందరీకరణ అంటున్నారని మండిపడ్డారు. రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తే.. ఎన్ని ఎకరాలకు నీరు వస్తుందని అన్నారు. అసలు ఇచ్చిన హామీల సంగతి ఏంటని ప్రశ్నించారు. రూ.4 వేల పింఛను ఎందుకు ఇవ్వడం లేదు. ఇందిరమ్మ ఇళ్లు ఎందుకు ఇవ్వడం లేదని అడిగారు. ప్రజలు తిరగబడితే మంత్రులు గ్రామాల్లో తిరగడం సాధ్యం అవుతుందా? అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం అని అన్నారు.


Similar News