వరంగల్‌ బల్దియా టౌన్​ప్లానింగ్‌ ఫ్లాప్​..!

గ్రేటర్​వరంగల్​ బల్దియా అధికారుల పనితీరుపై ప్రభుత్వ ఉన్నతాధికారులు మండిపడ్డారు.

Update: 2023-04-18 03:49 GMT

గ్రేటర్​వరంగల్​ బల్దియా అధికారుల పనితీరుపై ప్రభుత్వ ఉన్నతాధికారులు మండిపడ్డారు. అవినీతి ఆరోపణలు, అక్రమాలు నిత్యకృత్యమయ్యాయి. తాజాగా టౌన్​ప్లానింగ్ విభాగంలో అధికారుల నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇంటి నిర్మాణ అనుమతుల్లో తీవ్ర జాప్యానికి ప్రభుత్వం జరిమానా విధించింది. తొమ్మిది మంది టౌన్​ప్లానింగ్​ ఆఫీసర్లకు ఒక్కొక్కరికి రూ.3వేల చొప్పున జరిమానా విధిస్తూ పురపాలక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇంటి నిర్మాణంకోసం టీఎస్​బీపాస్​ద్వారా ఆన్​లైన్​లో

దరఖాస్తు చేసుకున్న 21రోజుల్లోగా అనుమతులు జారీ చేయాలి. ముందుగా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంటుంది. నిబంధనలకు లోబడి లేకుంటే సదరు కారణాలను ఆన్‌లైన్‌లో అధికారులు నమోదు చేయాలి. కానీ, అమ్యామ్యాలకు అలవాటుపడిన కొంత మంది అధికారులు కావాలనే అనుమతుల జారీల్లో తీవ్ర జాప్యం చేస్తున్నారు. దీంతో పురపాలక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కొరడా ఝులిపించారు. బల్దియాలో ఇన్​చార్జ్​ పాలనలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్నారని, ఇప్పటికైనా పూర్తిస్థాయిలో కమిషనర్ ను నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు పేర్కొంటున్నారు. 

దిశ, వరంగల్‌ టౌన్‌ : గ్రేటర్‌ వరంగల్‌ బల్దియాలో కొందరు అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కొంతకాలంగా వినపడుతున్నాయి. నిత్యం ప్రజలు బల్దియా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని పలువురు తిట్టిపోసిన ఘటనలు అనేకం. ముఖ్యంగా టౌన్‌ప్లానింగ్‌ విభాగం పనితీరుపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంటి నిర్మాణ అనుమతులు, ఇంటి నంబర్‌ కేటాయింపు, ఇతరత్రా అనుమతుల విషయంలో అధికారుల అలసత్వం రాజ్యమేలుతున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు బల్దియాలో అధికారుల సోమరితనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని తేటతెల్లమవుతోంది. ఇంటి నిర్మాణ అనుమతుల్లో చోటుచేసుకున్న జాప్యానికి ప్రభుత్వం జరిమానా విధించడం విధుల నిర్వహణపై వారికున్న నిబద్ధతకు అద్దం పడుతోంది. అందుకు వరంగల్‌ బల్దియాకు చెందిన తొమ్మిది మంది బిల్డింగ్‌ ఆఫీసర్లకు ఒక్కొక్కరికి రూ.3వేల చొప్పున జరిమానా విధిస్తూ పురపాలక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సదరు 9మంది ఉద్యోగుల వేతనాల్లో జరిమానాను కోత విధించనున్నట్లు టౌన్‌ ప్లానింగ్‌ అధికారి బానోత్‌ వెంకన్న ప్రకటించడం గమనార్హం.

 ప్లానింగ్‌తో‌నే ఆలస్యం..

ఇంటి నిర్మాణ అనుమతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తున్న 21రోజుల్లోగా జారీ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అనంతరం టౌన్‌ప్లానింగ్‌ విభాగానికి చెందిన అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అందుకు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ దరఖాస్తుతో సమర్పించిన దస్తావేజులు సరిగా లేకపోయినా, మున్సిపల్‌ నిబంధనలకు లోబడి దరఖాస్తుదారుడు వ్యవహరించకపోయినా సదరు కారణాలను ఆన్‌లైన్‌లో అధికారులు నమోదు చేయాల్సి ఉంటుంది.

కానీ, వరంగల్‌ బల్దియా అధికారులు నిర్ణీత గడువులోగా ఎలాంటి వివరాలు నమోదు చేయకపోవడంతో పురపాలక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌ స్వయంగా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, వరంగల్‌ బల్దియాలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఎలాంటి అనుమతుల విషయంలోనైనా జాప్యం చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కావాలనే అధికారులు ఆలస్యం చేసి, ఇంటి యజమానుల నుంచి ఆమ్యామ్యాలు దండుకుంటున్నారని బల్దియాలో బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ‘ఆలస్యం అమృతం విషం’ అన్నట్లుగా ఇప్పుడు బల్దియా టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ అధికారులు జరిమానా రూపంలో విధి వక్రించిందని పలువురు బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆరా తీస్తే...

కేవలం ఈ ఒక్క టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలోనే కాదు, బల్దియాలోని అన్ని విభాగాల్లో అధికారులు అలసత్వంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. టౌన్‌ ప్లానింగ్‌లో మరీ దారుణంగా ప్రతీ పనికి రేటు ఫిక్స్‌ చేసి వసూళ్లకు పాల్పడుతున్నట్లు నగరవాసులు ఆరోపిస్తున్నారు. గతంలో వరంగల్‌ బల్దియాకు చెందిన ఆర్‌ఐ, మరో ఉద్యోగి ఓ ఇంటి నిర్మాణ అనుమతుల విషయంలోనే యజమాని నుంచి డబ్బులు డిమాండ్‌ చేసి అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

అయినా, అధికారుల తీరులో మార్పు రాలేదనడానికి తాజాగా పురపాలక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌ తీసుకున్న చర్యలు నిలువుటద్దంగా నిలుస్తున్నాయి. అయితే, ఇదంతా ఉన్నతాధికారులు, బల్దియా పాలకుల కనుసన్నల్లోనే జరుగుతున్ననట్లు వాదనలు వినిపిస్తున్నాయి. అసలు, బల్దియాలోని అన్ని విభాగాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపడితే బల్దియా అధికారుల పనితీరు, ఆమ్యామ్యాల పర్వాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని బల్దియాలోని పలువురు సిబ్బంది, నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.

ఇన్‌చార్జ్‌ పాలనలో ఇష్టారాజ్యం..

అసలే వరంగల్‌ బల్దియాపై లెక్కలేనన్ని అవినీతి, అక్రమాల ఆరోపణలు ఉన్నాయి. పాలకవర్గం ఉన్నప్పటికీ పట్టించుకునే పరిస్థితి లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కమిషనర్‌ ఉంటే అయినా, అధికారుల విధుల నిర్వహణపై పర్యవేక్షణ ఉండేదని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. గతంలో ఉన్న కమిషనర్‌ ప్రావీణ్య కలెక్టర్‌గా బదిలీ కావడం, తిరిగి ఆమెకే బల్దియా ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించడంతో బల్దియాపై ఆమె ఎక్కువ దృష్టి సారించడం లేదని తెలుస్తోంది. దీంతో అధికారులు మరింత విచ్చలవిడిగా విధుల పట్ల అలసత్వంగా వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా మంత్రులు వరంగల్‌ బల్దియాపై దృష్టిసారించి, పూర్తిస్థాయి కమిషనర్‌ను నియమించడంతోపాటు పాలనా వ్యవహారాలు సజావుగా చూడాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News