దండం పెడ్తా, కాళ్లు మొక్తా.. కారు గుర్తుకు ఓటెయ్యండి: మాజీ మంత్రి మల్లారెడ్డి అసక్తికర కామెంట్

దండం పెడ్తా, కాళ్లు మొక్తా.. కారు గుర్తుకు ఓటేయ్యాలని మహిళలను మేడ్చల్ ఎమ్మెల్యే , మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అభ్యర్థించారు.

Update: 2024-04-22 16:12 GMT

దిశ, కంటోన్మెంట్/బోయిన్‌పల్లి: దండం పెడ్తా, కాళ్లు మొక్తా.. కారు గుర్తుకు ఓటేయ్యాలని మహిళలను మేడ్చల్ ఎమ్మెల్యే , మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అభ్యర్థించారు. సోమవారం రాత్రి మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థులకు మద్దతుగా ఇంపీరియల్ గార్డన్స్ కంటోన్మెంట్ మహిళ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కంటోన్మెంట్ ఎన్నికల ఇన్‌చార్జీ రావుల శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమ్మేళనంలో మల్లారెడ్డి పాల్గొని మాట్లాడారు.. కంటోన్మెంట్‌లో 30 ఏళ్ల పాటు సాయన్న ప్రజలకు సేవ చేశారని గుర్తు చేశారు.

మహిళల అభివృద్ధి కోసం గత బీఆర్ఎస్ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. సాయన్న, ఆయన కుమార్తె లాస్య నందిత పదవిలో ఉండగానే చనిపోయారని, ఆమె రెండో కుమార్తె నివేదితను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే వారి ఆత్మ శాంతిస్తుందని పేర్కొన్నారు. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కార్పొరేటర్‌గా గెలుపొందినా రూ.వందల కోట్లు సంపాదించుకునే లీడర్లు ఉన్నా.. ఈ కాలంలో 25 ఏళ్లు ఎమ్మెల్యేగా పని చేసిన సాయన్న ఏమి సంపాదించుకోలేదని అన్నారు. నిజాయితీ, నిస్వార్థంతో పని చేసిన సాయన్న కుమార్తె నివేదితకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు.

ఇన్‌చార్జీ రావుల శ్రీ‌ధర్‌రెడ్డి మాట్లాడుతూ.. గద్దర్ కుమార్తె వెన్నెలకు గత ఎన్నికల్లో టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ, ఈ ఎన్నికల్లో పక్కన బెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్దర్ పేరిట సినిమా అవార్డులు అందిస్తానని చెప్పినా సీఎం రేవంత్‌రెడ్డిని ఆమె కుమార్తెకు అన్యాయం చేశారని ఆరోపించారు. మహిళలంటే రేవంత్ రెడ్డికి గౌరవం లేదని, ఊసరవెల్లిలా పార్టీలు మారిన శ్రీ గణేష్‌కు టికెట్ ఇవ్వడం‌పై శ్రీధర్‌రెడ్డి మండిపడ్డారు. మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. మీ ప్రాంత సమస్యలను పార్లమెంట్‌లో ప్రశ్నించేందుకు కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని విజ్ఠప్తి చేశారు.

కన్నీటి పర్యంతమైన నివేదిత..

తన తండ్రి, చెల్లిని పొగొట్టుకుని పుట్టేడు దుంఖంతో ఉన్న తనను ఆదరించి కేసీఆర్ టికెట్ ఇచ్చి పంపారని కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత అన్నారు. తనకు మీరు తప్ప.. వేరే ఎవరు లేరని కన్నీటి పర్యంతమయ్యారు. తనకు ఓటేసి గెలిపిస్తే తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేస్తానని, మీకు కష్ట సుఖాల్లో తోడుంటానని నివేదిత అన్నారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, మాజీ బోర్డు సభ్యులు పాండు యాదవ్, అనిత, లోక్‌నాథం, నళిని కిరణ్, ప్యారసాని భాగ్యశ్రీ, మాజీ కార్పొరేటర్ రూప, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, నాయకులు హరిక్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News