శ్రీశైలం గౌడ్‌పై వివేకానంద దాడి.. కిషన్ రెడ్డి రియాక్షన్ ఇదే..!
కుత్బుల్లాపూర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆ పార్టీ నేతలు రౌడీల్లా దాడి చేయడాన్ని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
దిశ, తెలంగాణ బ్యూరో : కుత్బుల్లాపూర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆ పార్టీ నేతలు రౌడీల్లా దాడి చేయడాన్ని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నగరంలోని భూములు కబ్జా పెట్టి, కోట్లు కొల్లగొడుతూ.. ఆపై వీధి గూండాల్లా ప్రవర్తిస్తున్నారని ఒక ప్రకటనలో విమర్శలు చేశారు. రాజకీయాల్లో విమర్శ, ప్రతి విమర్శలు సాధారణమని, కానీ ఇలా భౌతిక దాడులకు దిగడం దుర్మార్గమన్నారు. కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే కేవీ వివేకానంద.. బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్‌పై ప్రవర్తించిన తీరును ఖండించారు.
శ్రీశైలం గౌడ్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం చేతకాక శ్రీశైలం గౌడ్ గొంతు పట్టుకొని దాడి చేశారని, ఇది పిరికిపంద చర్య అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గొంతు నులిమి దాడి చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని, లేదంటే తాము కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఓడిపోతామనే భయంతోనే బీఆర్ఎస్ నేతలు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. భౌతిక దాడులతో భయాందోళనలు సృష్టించి గెలవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ తల్చుకుంటే బీఆర్ఎస్ నేతలు రోడ్లపై తిరగలేరని, ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు. సహనాన్ని చేతకానితనంగా భావించొద్దని హెచ్చరించారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు, దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. బీఆర్ఎస్ అరాచక పాలనకు స్వస్తి చెప్పేందుకు జనం రెడీగా ఉన్నారని ఆయన పేర్కరొన్నారు. కూన శ్రీశైలంపై దాడికి పాల్పడిన బీఆర్ఎస్ అభ్యర్ధిపై వెంటనే కేసు నమోదు చేయాలని, ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని బండి డిమాండ్ చేశారు.