బాల్క సుమన్‌పై వివేక్ ఎటాక్.. చెన్నూర్‌లో తెరపైకి కొత్త నినాదం
బాల్క సుమన్ విద్యార్థి నేతగా పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో బరిలో దిగిన సమయంలో ప్రత్యర్థిగా ఉన్న గడ్డం వివేక్ మీద మాట్లాడిన మాటలు రక్తి కట్టించాయి.
దిశ, తెలంగాణ బ్యూరో : బాల్క సుమన్ విద్యార్థి నేతగా పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో బరిలో దిగిన సమయంలో ప్రత్యర్థిగా ఉన్న గడ్డం వివేక్ మీద మాట్లాడిన మాటలు రక్తి కట్టించాయి. నాపై తెలంగాణ ఉద్యమ కేసులు వంద ఉంటే... తన ప్రత్యర్థి వివేక్ దగ్గర 100 కోట్లు ఉన్నాయి. మీరు ఎవరి వైపో తేల్చుకోవాలని బాల్క సుమన్ ఎన్నికలకు వెళ్లారు. ఊహించిన రీతిలోనే సుమన్ పెద్దపల్లి నుంచి పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెన్నూర్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనతి కాలంలోనే సుమన్ ఆర్థికంగా బాగా ఎదిగారన్న ప్రచారంతో పాటు ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు కూడా పెరిగాయి.
సీఎం కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఫిర్యాదులు జరగడం కూడా సహజంగానే మారింది. దీనికి తోడు సుమన్ దూకుడు విధానం సొంత పార్టీ నేతల్లోనే అనేక సందర్భాల్లో వివాదాలకు దారి తీసింది. మళ్లీ ఇప్పుడు చెన్నూరు నుంచి అసెంబ్లీ బరిలో అధికార పార్టీ నుంచి పోటీ చేస్తుండగా... కాంగ్రెస్ అభ్యర్థిగా అప్పటి ప్రత్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి పోటీపడుతున్నారు. ఇప్పుడు వివేక్ తన ఎన్నికల నినాదాన్ని సుమన్‌పై ఎక్కు పెడుతున్నారు.
100 కేసులు.. వెయ్యి కోట్లు..
నాడు తనపై 100 కేసులు ఉన్నాయని వివేక్ వద్ద 100 కోట్లు ఉన్నాయని ప్రచారం చేసిన చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ వద్ద వెయ్యి కోట్ల అక్రమ ధనం ఉందని వివేక్ తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నారు. ఇసుక మాఫియాలోనే సుమన్ వెయ్యి కోట్లు సంపాదించారని ఆయన తన ప్రచారంలో ప్రెస్ మీట్‌లలో విరుచుకుపడుతున్నారు. ఒక విద్యార్థినేతగా ఉండి పదేళ్ల కాలంలోనే ఆయన అంతలా రాజకీయ పదవులను అడ్డం పెట్టుకుని చెన్నూరు నియోజవర్గాన్ని దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
ఇది రాజకీయంగా దుమారం రేపుతుండడమే గాక... ప్రజల్లోనూ చర్చకు దారి తీస్తున్నది. నాడు సుమన్ 100 కేసులు రూ.100 కోట్ల నినాదంతో ప్రజల్లోకి వెళ్ళగా... వంద కేసుల మనిషి దగ్గర రూ.1000 కోట్ల అక్రమ సంపాదన ఉందంటూ వివేక్ తాజాగా ఎటాక్ చేస్తున్నారు. ఓట్లు అడిగేందుకు వస్తే ఇంతటి అక్రమ ఆస్తులు ఎలా సంపాదించారని సుమన్ ను నిలదీయాలని వివేక్ పిలుపునిస్తున్నారు. ఇది చెన్నూర్ నియోజకవర్గం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.