రేవంత్ పై ఉత్తమ్ గుస్సా!
తెలంగాణలో బలపడేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు ఆ పార్టీలో చోటు చేసుకుంటున్న వర్గపోరు నీరుగారుస్తున్నది.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో బలపడేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు ఆ పార్టీలో చోటు చేసుకుంటున్న వర్గపోరు నీరుగారుస్తున్నది. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ టీపీసీసీ ఉత్తమ్ మధ్య చిచ్చు రాజుకుంది. వీరిద్దరి మధ్య నిరుద్యోగ నిరసన సభ చిచ్చు పెట్టింది. నిరుద్యోగ సమస్య, టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై పెద్ద ఎత్తున ఉద్యమించాలని టీపీసీసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 21న నల్గొండలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ లో నిరుద్యోగ నిరసన కార్యక్రమం చేపడతామని రేవంత్ రెడ్డి మంగళవారం ప్రకటన చేశారు.ఈ ప్రకటనపై ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమకు సమాచారం ఇవ్వకుండానే రేవంత్ రెడ్డి తమ జిల్లాలో కార్యక్రమాన్ని ఎలా ప్రకటిస్తారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ తీరుపై రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావు థాక్రేకు ఉత్తమ్ ఫిర్యాదు చేశారు. కాగా పార్టీ కార్యక్రమాల విషయంలో రేవంత్ రెడ్డి ఏక పక్షంగా వెళ్తున్నారనే విమర్శలు సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన మంచిర్యాల సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలోనే రేవంత్ వర్సెస్ సీనియర్లు అన్నట్లుగా వ్యవహారం నడిచింది. ఈ సభతో బహిర్గతమైన అంతర్గత విభేదాలు విషయం మరిచిపోకముందే ఇప్పుడు నిరుద్యోగ నిరసన సభ చిచ్చు పార్టీలో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అనేది ఆసక్తిగా మారింది.