'మీ వల్లే ఇదంతా'.. కేసీఆర్ పై ఉత్తమ్ ఫైర్

కేసీఆర్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు.

Update: 2024-06-07 13:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: గత బీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం డ్యామేజ్ అయి నిరుపయోగంగా మారిందని, రూ. 94 వేల కోట్లు అప్పు చేసి కట్టిన ప్రాజెక్టు కుంగిపోతే ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం దానికి వడ్డీ కట్టాల్సి వస్తోందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కుంగిన వెంటనే గేట్లు ఎత్తి ఉంటే ఇంత డ్యామేజీ జరిగేది కాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పేర్కొన్నదని వెల్లడించారు. దెబ్బతిన్న చోట్ల రిపేర్లు చేసి అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల మూడు బ్యారేజీల గేట్లు ఎత్తిపెట్టాలని ఎన్‌డీఎస్ఏ సూచించిందని తెలిపారు.

ప్రతిరోజూ నివేదిక ఇవ్వండి..

కేసీఆర్ నీళ్లు స్టోరేజ్ చేయవచ్చని ప్రచారం చేస్తున్నారని, కానీ ఎన్డీఎస్ఏ మాత్రం గేట్లు ఎత్తాలని చెబుతోందని మంత్రి పేర్కొన్నారు. నిపుణుల కమిటీ సూచనలు ఇచ్చేవరకు గేట్లు ఓపెన్ చేసి ఉంచుతామన్నారు. కాంట్రాక్ట్ నిర్మాణ సంస్థల ఖర్చులతోనే ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు జరుగుతున్నాయని, వర్షాలకు ముందే పనులు పూర్తి కావాలని నిర్మాణ సంస్థలను ఆదేశించామని ఉత్తమ్ వివరించారు. సుందిళ్ల పనుల జాప్యంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల 28లోగా మరమ్మతులు పూర్తి కావాలని కంపెనీ ప్రతినిధులకు స్పష్టం చేశారు. పనుల పురోగతిపై ప్రతిరోజు నివేదికలు ఇవ్వాలన్నారు. విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా గతంలో ఉన్న ఇంజినీరింగ్ అధికారులను తొలగించామని, జ్యుడీషియల్ విచారణ రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.

కేసీఆర్ గురించి మాట్లాడటం వేస్ట్..

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఫలితాలను చూసిన తర్వాత కేసీఆర్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అని మంత్రి ఉత్తమ్ సెటైర్ వేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఉంటే ఇంతకంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు నీళ్లు వచ్చేవని తెలిపారు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ లక్ష కోట్ల ప్రజాధనాన్ని నీళ్ల పాలు చేశారని విమర్శించారు. తుమ్మడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మిస్తామని మంత్రి వెల్లడించారు.

7వ బ్లాక్‌లో బుంగ వాస్తవమే..

ఈ సందర్భంగా ఈఎన్సీ అనిల్ మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్‌లో బుంగ పడింది వాస్తవమేనని క్లారిటీ ఇచ్చారు. పియర్స్ కింద ఇసుక కొట్టుకుపోవడం వల్లే బుంగ పడిందని.. ఫిల్లింగ్ చేస్తున్నామని చెప్పారు.

Tags:    

Similar News