బీఆర్ఎస్ పార్టీకి అపూర్వ స్పందన: కవిత
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అందుకే టీఆర్ఎస్, బీఆర్ఎస్‌గా మారిందన్నారు. బీఆర్‌ఎస్‌కు ప్రతీ రాష్ట్రం నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని చెప్పారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో కలిసి ఎమ్మెల్సీ కవిత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ప్రజలకు పనికొచ్చే కార్యక్రమలే కేసీఆర్ చేపడుతున్నారన్నారు. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇలాంటి కార్యక్రమాలు అమలవుతున్నాయా అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజల ఆశీస్సులు, ఆశీర్వాదంతోనే బీఆర్ఎస్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దేశంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు తెస్తామన్నారు. నగరంలో పాత భవనాల కూల్చివేతలపై బీజేపీ అనవసర ఆందోళనలు చేస్తోందని మండిపడ్డారు. నిజామాబాద్ పట్టణాన్ని అద్భుతం నగరంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ హైటెక్స్ తరహాలో రూ.100 కోట్లతో కళాభవనం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఆర్టీసీ బస్టాండ్ నూతనంగా నిర్మిస్తామన్నారు. కాంగ్రెస్ పాలనలో అసంపూర్తిగా వదిలేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనులను తాము 186 కోట్లతో పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, నగర మేయర్ దండు నీతు కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.