రుణమాఫీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తోన్న రైతు రుణమాఫీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తోన్న రైతు రుణమాఫీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు రుణమాఫీ సంపూర్ణంగా జరుగడం లేదని అన్నారు. ఏ విడతలో కూడా రైతులకు న్యాయం జరుగడం లేదని తెలిపారు. ఒకవైపు రుణమాఫీ కానీ రైతులు బాధలో ఉంటే.. మంత్రులు మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రచారం మాత్రం అద్భుతంగా చేసుకుంటున్నారని విమర్శించారు. రైతు రుణమాఫీ కాని వారు, రైతు భరోసా అందని రైతులు సీఎం రేవంత్ రెడ్డికి ఉత్తరాలు రాయాలని పిలుపునిచ్చారు.
అంతేకాదు.. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన బీజేపీ పోరాడుతుందని హామీ ఇచ్చారు. కాగా, తొలి విడతలో భాగంగా రూ.లక్ష రుణమాఫీ చేసిన ప్రభుత్వం, రెండో విడతలో రూ.1.50 లక్షల వరకు మాఫీ చేసింది. ఇక ఆగష్టు 15వ తేదీలోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. తొలి విడతలో రూ.6098 కోట్లు, రెండో విడతలో రూ.6190 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తంగా రెండు విడతల్లో కలిపి 17 లక్షల 75 వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 12 వేల 224 కోట్లు జమ చేసింది ప్రభుత్వం.