స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదానికి కారణం అదే: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
స్వప్నలోక్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం ఘటన దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: స్వప్నలోక్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం ఘటన దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలలో పేదలు, అమాయకుల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన చెందారు. ఆదివారం ఉదయం స్వప్నలోక్ కాంప్లెక్స్ ను సందర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదాలకు కారకులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. గోదాములు, స్క్రాప్ దుకాణాలను అధికారులు తనిఖీ చేయడం లేదని, సిబ్బంది తక్కువగా ఉన్నారని అగ్నిమాపక శాఖ అధికారులే చెబుతున్నారన్నారు.
ఆదాయం కోసం ప్రభుత్వమే అక్రమ భవనాలను క్రమబద్ధీకరింస్తోందని మండిపడ్డారు. అగ్నిప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. పోలీస్, ఫైర్, ఎలక్ట్రిసిటీ, జీహెచ్ఎంసీ, రెవెన్యూ డిపార్ట్ మెంట్‌లతో ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రమాద విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లాలని మృతులకు పీఎం రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియో ప్రకటించారని చెప్పారు. సికింద్రాబాద్ ప్రాంతంలో వరుస అగ్నిప్రమాదాలు సంభవించడంపై సీఎస్‌కు లేఖ రాయబోతున్నట్లు తెలిపారు. భవన యజమానుల నిర్లక్ష్యంతో ప్రమాధాలు సంభవిస్తే అలాంటి వారిపై కఠిన శిక్షలు పడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదాలు జరుగుతున్నా భవనాల యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణం అన్నారు.