కేసీఆర్‌కు ఆహ్వానం పంపించాం.. వస్తారని ఆశిస్తున్నా: కిషన్ రెడ్డి
యోగా చేస్తే ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఉండదని, యోగా చేస్తే ఎవరికి వారు డాక్టర్లుగా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హరితప్లాజాలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
దిశ, తెలంగాణ బ్యూరో: యోగా చేస్తే ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఉండదని, యోగా చేస్తే ఎవరికి వారు డాక్టర్లుగా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హరితప్లాజాలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీ యోగాను యావత్ ప్రపంచానికి పరిచయం చేశారని కొనియాడారు. సుమారు 200కు పైగా దేశాలు యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాయన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సెకండ్ ఫేజ్‌లో భాగంగా ఈ ఏడాది జూన్ 21వ తేదీన యోగా దినోత్సవానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. దేశంలోని అన్ని గ్రామాలు, ప్రతి ఇంట్లో యోగా చేపట్టాలని ఆయన కోరారు. ప్రపంచ దేశాల్లో తూర్పున ఉన్న ఫిజీ నుంచి పశ్చిమాన ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో వరకు అన్ని దేశాలు యోగా నిర్వహించుకుంటున్నాయని, ఈ ఘనత ప్రధాని మోడీకే దక్కిందన్నారు.
జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా 100 రోజుల ముందే ప్రజలకు అవగాహన కల్పించేందుకు కౌంట్ డౌన్ ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. 100 రోజుల కౌంట్ డౌన్‌ను ఢిల్లీలో, 75 రోజుల కౌంట్ డౌన్‌ను అస్సాంలో, 55 రోజుల కౌంట్ డౌన్‌ను రాజస్థాన్‌లోని జైపూర్ సిటీలో ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. కాగా ఈనెల 27వ తేదీన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో 25 రోజుల కౌంట్ డౌన్‌ను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు సర్వానంద సోనవాల్, అనురాగ్ ఠాకూర్, భూపేందర్ యాదవ్, ఆయూష్ శాఖ సహాయ మంత్రి మహేంద్ర భాయ్ పాల్గొంటారని కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. పరేడ్ గ్రౌండ్‌లో ఈనెల 27వ తేదీన ఉదయం 5:30 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
పలు స్వచ్ఛంద సంస్థలు జేఏసీగా ఏర్పడి యోగా దినోత్సవాన్ని సక్సెస్ చేయాలని కృషి చేస్తున్నాయని, ప్రజలు భారీగా తరలివచ్చి దీన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తిచేశారు. అరబ్, ఇస్లామిక్ దేశాలు కూడా యోగా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నాయని ఆయన గుర్తుచేశారు. అనేక దేశాలు యోగా గురువులు కావాలని భారత్‌ను అడుగుతున్నాయని, ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పలువురిని విదేశాలకు పంపించి ఇతర దేశస్తులకు ట్రైనింగ్ ఇస్తున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళి సై, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ఇన్విటేషన్ పంపిస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ పరేడ్ గ్రౌండ్‌కు స్వచ్ఛందంగా వచ్చి యోగా చేస్తారని భావిస్తున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.