ఆ విషయంలో మనం చాలా బెటర్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

సౌరశక్తితో విద్యుదుత్పత్తి ఎంతో అవసరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు...

Update: 2024-10-13 14:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సౌరశక్తితో విద్యుదుత్పత్తి ఎంతో అవసరమని, ప్రపంచం అన్ని రంగాల్లో చాలా వేగంగా ముందుకెళ్తోందని, సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతోందని, కర్బన ఉద్గారాలను తగ్గించడంలో సాంకేతికతను వినియోగించుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్(జీఎస్ఐ టీఐ) రూఫ్‌టాప్ సోలార్ పవర్ ప్లాంట్ ఇన్‌స్టాలేషన్‌కు ఆదివారం కిషన్ రెడ్డి హాజరై మాట్లాడారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే క్రమంలో సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచడం కూడా చాలా కీలకమన్నారు. పర్యావరణ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ.. సహజవనరైన సౌరశక్తితో విద్యుదుత్పత్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టడం అవసరమని కిషన్ రెడ్డి చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా రష్యా, చైనా, అమెరికా వంటి దేశాల ప్రజలనుంచి సగటున 9 నుంచి 14 టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతోందని, అదే మన దేశంలో.. ఇది కేవలం 1.89 టన్నుల కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. ఆయా దేశాలతో పోలిస్తే.. దేశంలో చాలా తక్కువ కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాన్నారు. వారితో పోలిస్తే దేశం బెటర్‌గానే ఉందన్నారు. అయినా.. భూమిని కాపాడుకోవడం, తర్వాతి తరాల కోసం నివాసానికి అనుకూలమైన పరిస్థితులుండేలా చూడటం మన బాధ్యత అన్నారు. ప్రకృతితో కలిసి జీవించడం భారతీయ జీవన విధానమని, అందుకే కేంద్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణలో ప్రతిఒక్కరి భాగస్వామ్యం ఉండేలా.. మిషన్ లైఫ్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని కిషన్ రెడ్డి తెలిపారు. అందుకే మోడీ ఈ ఏడాది ఫిబ్రవరి 15న ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనను ప్రారంభించారని తెలిపారు. ఇళ్లకు ఉచిత విద్యుత్ ఇవ్వడమనే ఆలోచనతోపాటుగా.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిగా సోలార్ ఎనర్జీతో పనిచేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

భారతదేశంలో ప్రస్తుతం 200 గిగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తి జరుగుతోందని, 2030 నాటికి దీన్ని 500 గిగావాట్లకు తీసుకెళ్లే లక్ష్యం అందరిపై ఉందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జీఎస్ఐ టీఐ చొరవ కారణంగా.. సోలార్ విద్యుత్ వినియోగం పెరగడంతోపాటుగా.. ప్రతి ఏటా ఈ సంస్థకు రూ.30 లక్షల ఆదా జరుగుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. రామగుండంలో రూ.423 కోట్లతో.. 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుచేశామన్నారు. గుజరాత్ లోని కచ్‌లో నేవేలీ లిగ్నయిట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 500 మెగావాట్ల భారీ సోలార్ ప్రాజెక్ట్ పనులు పూర్తి కావొచ్చాయని, ఇందులోనుంచి 200 మెగావాట్ల విద్యుత్ తెలంగాణకు అందనుందన్నారు. దీని ద్వారా తెలంగాణకు 20 ఏళ్లలో దాదాపు 2వేల కోట్లు ఆదా అవుతుందని వివరించారు. 2070 నాటికి నెట్ జీరో టార్గెట్ ఈ మిషన్ లక్ష్యమని కిషన్ రెడ్డి తెలిపారు. సౌర విద్యుత్ వినియోగ ప్రయాణంలో స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు.


Similar News